Monday, December 28, 2009

అమ్మ ఆశీర్వాదము

ఈ రోజు మా అమ్మ పుట్టిన రోజు . ఉదయమే అమ్మను విష్ చేసి వద్దామని నేను , జయ అమ్మ దగ్గరికి వెళ్ళాము . అమ్మకు నేను , నా కిష్టమైన లిల్లీపూల గుచ్చాన్ని , ఒకచీరను బహుకరించి ,అశీర్వాదము తీసుకున్నాను . జయ , అమ్మ కోరిన , శ్రీమద్బగవద్గీత , గీతాప్రెస్ , గోరఖ్ పూర్ వారిది , వారివే చిన్న చిన్న పాకెట్ శ్రీమద్బగవద్గీత లు ఓ పది , ఒక స్వీట్ పాకెట్ ఇచ్చి ఆశీర్వాదము తీసుకున్నది .

అందరూ వాళ్ళ బ్లాగులలో కవితలు రాస్తారు , నాకేమో రాయటము రాదు , నిన్ను రాసి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వవు అని , నేను మా అమ్మతో పోట్లాడుతే , మాజయ కొడుకు ప్రశాంత్ , మా మనవరాలు మేఘ , పుట్టిన రోజు నాడు రాసిన ఆశీస్సుల కవితలు తీసి ఇచ్చింది . ఇవి ఇప్పటివరకూ మాకెందుకు చూపలేదు అని ,ఇంకోసారి పోట్లాడి తెచ్చుకున్నాను .. ఇదిగో ఆ కవితలు .

1. ప్రశాంత్ పుట్టినరోజు అక్టోబర్ 2 . ఆ రోజున అమ్మమ్మ ఆశీస్సులు :

ఎ౦దరో మహాత్ముల జన్మలాగే

ప్రశా౦తుని జన్మ కూడా మేరు

శిఖర మంత అఖండ ఖ్యాతి పొం

దాలని పెద్దల శుభాశీస్సులు .

2 .మా మనవరాలు మేఘ పుట్టినరోజు మార్చ్ 5 .ఆ రోజున పెద్ద అమ్ముమ్మ ఆశీస్సులు .

ముత్యాలు రాశి పోసి నట్లున్న

మురిపాల నవ్వుల ముఖ్య అతిధి

మేఘాల నుంచి రాలి పడ్డ సుమ

బాలకు జన్మదిన శుభాకాంక్షలు .

Friday, November 27, 2009

వంశీనాదం


మా పుట్టింట్లో కవితా ధోరణి ఎక్కువ . అందరూ చిన్నవో పెద్దవో కవితలు రాస్తారు . అదేమిటో నాకా పాండిత్యము అబ్బలేదు . మా మేనళ్ళుళ్ళు రాసిన కవితలు చూడగానే బాబ్బాబు నాకాస్త అప్పియ్యండిరా , ఇంతవరకు నా బ్లాగ్ లో కవితలు రాసుకోలేదు , మీ పేరు చెప్పుకొని రాసుకుంటానురా , అని గడ్డం పట్టుకొని బతిమిలాడుకుంటే , దయతలిచి ఇచ్చారు .

మా పెద్దతమ్ముడు ( మా పిన్ని కొడుకు ) భాస్కర్ కొడుకే ఈ వంశి . మా మరదలు దేవకి కి భావకురాలు అని మారు పేరు . అలా రెండు వైపులనుండి వంశీ కి కవితా గంధం అంటిందన్నమాట. ! మా పిన్ని భాష లో చెప్పాలంటే వాడి బుద్ధి కుదురుగా వున్నప్పుడు కవితలు రాస్తూవుంటాడు . కాని అవన్నీ ఒకచోట రాసుకునే కుదురు ఇంకా రాలేదుట ! మార్చ్ లో కాలేజ్ వదిలి నప్పుడు ఈ కవిత రాసుకున్నాడుట. ప్రస్తుతము , విజయవాడలో యం. కాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు . ఈ కవిత నేను బ్లాగ్ లో వేస్తానన్నప్పుడు , మా అమ్మ అందులోని రెండు చరణాలు తెసేయమని వంశీకి చెప్పింది . కాని వంశీ అంతగా వ్రాసుకున్నవి నాకు తీయాలనిపించక అలానే వుంచాను .

వంశీనాదం :
కాలమెలా గడిచిందో తెలియని మూడు వసంతాలు
తరచి చూసుకుంటే ఆ గడిచిన కాలములో
కొత్త పరిచయాలు , సరికొత్త స్నేహాలు
కవ్వించే పడుచుల మాటలు
వాటికి కొంటె కుర్రాళ్ళ సమాధానాలు
మధురమైన అనుభూతులు
పంచుకున్న తాయిలాలు
మధ్య మధ్య లో చిరు కలహాలు , గిల్లి కజ్జాలు
కొన్ని కలతలు , మరి కొన్ని కలవరింతలు
చేసిన సన్నాహాలు , ఉత్సవాలు , అల్లర్లు
అరికట్టే అధ్యాపకులు
మళ్ళీ బుజ్జగించి , ఊరడించే ఉపాధ్యాయులు
శిలను మలిచి , శిల్పంగా మార్చి
విలువైన మార్గము చూపే మార్గదర్శకులు
వీరందరి ఆశీర్వచనాలతో
జీవిత పయనంలోకి తొలి అడుగు వేస్తూ
నేడు విడిపోతున్నా , వీడి పోని స్నేహానికి
మన కలయిక భాష్యం చెప్పాలి
శాశ్వత రూపంగా నిలచి పోవాలి . . . . . . .

నీ కవిత నా ప్రభాతకమలం లో ప్రచురించేందుకు అనుమతించినందుకు , థాంక్ యు వంశీ . నీనుండి ఇంకా కవితలు రావాలని కోరుకుంటున్నాను .

Monday, November 16, 2009

ఆవాహన

ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రిక నవలా రచయతలలో సుప్రసిద్ధులు . కొన్ని వందల కథలు , వ్యాసాలు , 30 నవలలు వ్రాసారు . " చారిత్రిక నవలా చక్రవర్తి " , "చారిత్రిక నవలాసామ్రాట్ " , " అభినవ పాల్కూరి " అనే బిరుదులు సంపాదించారు . వీరి నవల "ఆవాహన " కోసం 8 సంవత్సరాలు వెతికి , చివరికి వారిదగ్గరనుంచే తీసుకున్నాను . ప్రస్తుతము , ఈ నవల చలనచిత్రము గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట .

మాధవరావు బాంక్ ఉద్యోగి . వరంగల్ కి బదిలీ అయ్యి భార్య లక్ష్మి , కూతురు ఇందిర లతో వస్తాడు . అతని స్నేహితుడు రామచంద్ర రావు లెక్చరర్ గా వరంగల్ లో పని చేస్తుంటాడు . రామచంద్ర రావు భార్య కాత్యాయిని . ఇరు కుటుంబాల వారు చాలా స్నేహితముగా వుంటారు .

ఓ సాయంకాలము , మాధవరావు వేయిస్తంబాలగుడి కి వెళుతాడు . గుడి లోని శిల్పాలను పరవశం గా చూస్తూ , నంది ఎదురుగా వున్న , అసంపూర్తి మంటపం లోకి వెళుతాడు . అప్పటి కే సూర్యాస్తమయం అయ్యింది . ఆలయమంతా తెల్లని వెలుగులతో నిండి వుంది .టూరిస్ట్ లంతా ఒకరొకరే వెళ్ళి పోతున్నారు .శిధిల మంటపము లో ఎవ్వరూ లేరు , మాధవరావు తప్ప .
అక్కొడక నర్తకి బొమ్మ వుంది .
ఆ బొమ్మను చూస్తూ మాధవరావు అలాగే నిలబడి పోయాడు .
ఎందుకో ఆ బొమ్మను చూడగానే మాధవరావు శరీరం గగుర్పొడిచింది .
కళ్ళవెంట నీళ్ళు కారాయి .
ఏమి శిల్పమది ?
ఎంతటి రమణీయ సజీవ చిత్రణం ?!
మాధవరావు ఆ బొమ్మ ముందు తానూ ఓ బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోయాడు .
అలా ఎంత సేపు నిలబడ్డాడో తెలీదు .
ఇంతలో చంద్రోదయమైంది .
వైశాఖపూర్ణిమ !!
పుచ్చపువ్వులా చంద్రుడు వెలిగి పోతున్నాడు ఆకాశంలో .
ఏమిటి చూస్తున్నావు ? ఎవరో మాధవరావును పలకరించారు .
శిధిల మంటపం లో ఒకామె కూర్చొని వుంది .
. . . . . . . . . . . . . . . . . . . . . . .
ఆమె పైటచెంగు గాలికి రెపరెపలాడుతోంది .
చేతుల గాజులు మెరుస్తున్నాయి .
మెడలో బంగారు నగలు ..
ముఖం కోలగా వుంది .
సున్నితమైన పెదవులు , మృదువైన బుగ్గలు . చిన్ని నోరు , గాలికి రేగే ముంగురులు .
. . . . . . . . . . . . . . . . . . . . . . . . ..
ఆమె ఎందుకో ఒక్కసారి ఆవేశంతో ఏడ్చింది . అలా ఏడుస్తూనే శిల్పాల చాటుకు వెళ్ళిపోయినట్లనిపించింది మాధవరావుకు .
"ఏమండీ - ఏమండీ " మాధవరావు కేకేసాడు .ఎవరూ బదులు పలకలేదు . గబ గబా మంటపమంతా వెతికాడు . ఎవరూ కనిపించలేదు .
ఆమె ఎవరు ? ప్రతి పౌర్ణమి కి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ? అదీ మాధవరావుకు మాత్రమే ! అదీ పదీహేను నిమిషాలు మాత్రమే వుంటుంది . ఎందుకు ? ఈ ప్రశ్నలకి సమాధానం నవలలో మాత్రమే తెలుస్తుంది .

" కళలను , రాజకీయాలతో ముడి పెట్టటము నాకిష్టము లేదు కామసాని " . ఆంటాడు శిల్పచార్యుడు , భళ్ళాల సొమేశ్వరుడు .
" ఇక్ష్వాకులు పోయారు ,విష్ణుకుండినులు పోయారు . . . . . నేడు కాకతీయులు , రేపు మరొకరు .ఇలా ఒక్కో సామ్రాజ్యానికి ఒక్కో రాజు , ఒక్కో రాణి , వారికి ఒక్కో కూతురు , ఆ కూతురు పెళ్ళికి మనం మంటపాలు చెక్కటం . ఆ రాణీ , ఆ పెళ్ళీ ఏమీ మిగలవు - మనము చెక్కిన మంటపాలు మాత్రం మిగులుతాయి చరిత్రలో . " అంటాడు శిల్పి . ఎంత నిజమో కదా !

ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నవలనే రాసేస్తానేమో !

ఈ నవల లో రచయత కాకతీయ సామ్రాజ్యపు , వీరశైవ వైభవం , ఆనాటి సామాజిక స్తితిగతులు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు . రాణిరుద్రమదేవి కాలమునాటి వైభవము చదువుతుంటే , ఆ కాలము లో పుట్టి వుంటే బాగుండేది అనిపిస్తుంది !

చదవటము మొదలు పెట్టాక సమయమే తెలీలేదు . పూర్తి చేసాక కాని తెలీలేదు , నేను కాకతీయ సామ్రాజ్యములో లేను , హైదరాబాద్లో మా ఇంట్లో వున్నాను అని . అంతగా లీనమైపోయాను !

ప్రతులకు రచయితని సంప్రదించండి .ఫోన్ నంబర్ : 27425668


ఇది "పుస్తకం " లో వచ్చిన నా ఆర్టికల్ .

Friday, November 6, 2009

బామ్మ మాట బంగారు బాట

మా చిన్నాడపడుచు ఉష , అత్తగారు , శ్రీమతి . లలిత వెంకటరత్నం గారు . వారు మాకు ఉష పెళ్ళైనప్పటి నుండి పరిచయము . అంటే దాదాపుగా 30 సంవత్సరాలనుండి తెలుసన్నమాట. ఎప్పుడు వారింటికి వెళ్ళినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు . నా ఒక్కదాని తోనే కాదు అందరితో అలాగే వుంటారు , ఎవరికి వారికే వారొక్కరంటేనే ఆవిడకి ప్రత్యేక అభిమానమనుకుంటారు . అంటే అంతగా అందరినీ అభిమానించటము ఆవిడ ప్రత్యేకత . ఇన్ని సంవత్సరాలలో ఆవిడ మోమున చిరునవ్వేతప్ప , విసుగు , చిరాకు ఎప్పుడూ చూడలేదు . మీరు ఇలా ఎలా వుండగలుగుతున్నారు ? మీ విజయ రహస్యం ఏమిటి ? నాకు కాక పోయినా , నిన్ననే పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళిన మీ మనవరాలు , స్నిగ్ధ కైనా చెప్పండి , నేనూ ఓ చెవ్వేస్తాను అని అడిగాను . దానికి ఆవిడ తన జీవితానుభవాన్ని రంగరించి చెప్పిన మంచి ముత్యాలలాంటి మాటలు అందరితో పంచుకుందామనిపించింది .

ఆవిడ చెప్పే మాట వినేముందు , ఆవిడ గురించి వారి పెద్ద అమ్మాయి శ్రీమతి . సంధ్య గారు చెప్పింది విందాము .

" అమ్మలగన్న మాయమ్మ "

మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన ధీర మా అమ్మ

నిజ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎంతొ సమర్ధ్హ వంతంగా ఎదుర్కొని నిలబడ్డ మహా వృక్షం ధాత్రి

లలితమ్మగుంటూరు లో పుట్టి

నరసాపురంలొ మెట్టి యర్రమిల్లి వెంకటరత్నం గారి భార్యగా ఆరుగురిని కన్నతల్లి లలితమ్మ
కళలకు కాణాచి (సంగీతం రాదండోయ్ )

అధ్యాత్మిక చింతనకు చింతామణి

మీకు తెలుసా సంచీ జడ కజ్జికాయ జడ సన్నజాజులతో నెట్టు జడ మల్లెలతో వంకీ జడ మొగలిపూలతో పెట్టె జడ చిలకల జడ ఇలా అరవై రకాల జడలు వేసేది మరీ మరీ చెప్పల్సిన విషయం మా మనమరాలికి ఎప్పుడు ఫ్రాక్ కొనాలన్న గుర్తుకొచ్హేది మా అమ్మ మాకు కుట్టిన జెమిని వారి బాకాలూదే జంట చెడ్డీ పిల్లలు : లక్శ్ సబ్బు మీద పూల సజ్జ గుర్తుకొస్తాయ్ చెప్పాలంటే చాలవుంది చోటేమో కొంచెం వుంది .

అమ్మల (అమ్మమ్మలం కూడా ) గన్న యమ్మ మా అరుగురికి మూలపుటమ్మ

మరిది , చెల్లెలి పిల్లలకి చాల పెద్దమ్మ

"శివుని " పతిగా పొందిన సతిమా అమ్మ లలితమ్మ
సంధ్య

సంధ్య గారు , స్తలాభావమని అనుకోవద్దు . మీ అమ్మగారి గురించి మీరెంత చెప్పినా పొస్ట్ రాసేందుకు నేను సిద్దం !

లలితమ్మగారు చెప్పిన మాట , బంగారుబాట ;

సృష్టికీ ఆరంభ కాలము నుండి మహిళదే ఉన్నత స్థానము గా మనము భావించవచ్చు . దేశకాల పరిస్తితులను బట్టి ఆవిడ భాద్యతలలో స్వభావము మారుతూ వచ్చాయి .ఏమైనప్పటికీ పిల్లల భాద్యత , ఇంటి నిర్వహణ , అథిధి సత్కారాలు , అత్తమామల సేవ , భర్తకు కావలసినవన్నీ సమకూర్చటము తప్పనిసరి .

రాను రాను మహిళలు విధ్యావంతులు అవటమేకాక ఆర్ధికంగా గృహనిర్వహణలో భాగం పంచుకోవలసి వస్తోంది . అంతేగాక పిల్లల విధ్యలో కూడ చాలా మార్పులు రావటమేకాక పోటీ ఎక్కువగా వుండటము వలన పిల్లలను దగ్గర వుండి చదివించవలసి వస్తోంది .

తను చేసే ఉద్యోగము కూడ భాద్యతగా చేయాలి కాబట్టి , సమయానికి గంట కొట్టినట్టు ఆపేసి లేచి రాలేదు .వచ్చే ప్రమోషన్లను వదులుకోలేక ప్రయాసకు ఓర్చి పని చేయాల్సి వస్తోంది .నిజంగా ఆలోచిస్తే మహిళకు శ్రమ ఎక్కువైందనే చెప్పవచ్చు .

అటు ఇల్లు , ఇటు ఉద్యోగం , రెంటినీ సమతూకం గా చేసుకోవాలి .

పిల్లల పెంపకములో చాలా జాగ్రత్త అవసరము . వారి ఆరోగ్యం , మనోవికాసానికి కావలసిన ఆటలూ , విధ్య , ప్రపంచ జ్ఞానం , ఇంకా వారికి కావలసిన ఎన్నో అవసరాలు అన్నిటికీ తల్లి తోడ్పడవలసివున్నది .

2.ఇంటి పనులు చాకచక్యముగా నౌకర్ల తో చేయించుకోవలసిన అవసరము ఎంతైనా వుంది .

3. ఇంట్లో అత్తమామలు , పెద్దవారి అవసరాలు కనిపెట్టి తీర్చగలగాలి .

4. ఆఫీసు వేళకు అన్ని పనులు చేసుకొని , పిల్లలని పంపి , తను కూడ సమయానికి వెళ్ళాలి .

కనుక ఈనాటి అమ్మాయిలకు ఎంత భారం పడుతోందో మనము తెలుసుకోవాలి . నేర్పు తో ప్రతిపనికీ కొంతకాలం కేటాయించుకొని నిర్వర్తించాలి .

ఎంత చేసినా ఏదో మాట వస్తూనే వుంటుంది . శాంతమూ , ఓర్పు ,నేర్పు ఎంతవున్నా చాలవనిపిస్తుంది . కనుక , వారికి చేదోడు వాదోడుగా భర్త , అత్తమామలు , ఇంటికి వచ్చిన అథిధులూ , పిల్లలూ సహకరించాలని నా వుద్దేశం .

అన్ని సమర్ధించకలదు కనుకనే మహి ( భూదేవి ) ళ అంటున్నాము . కనుక ఈనాటి అమ్మాయికి భూదేవికి వున్నంత ఓర్పు వున్నదని నేను భావిస్తున్నాను.

ఇంతటి అనుభవజ్ఞురాలు చెప్పిన సలహాలకు విశ్లేష్ణ రాయటానికి నా అనుభవము సరిపోదు , కనుక మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను .

పిన్నిగారు ,మీ విలువైన సమయములో ,కొద్దిగా నాకోసం వెచ్చించి , నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదములు .
సంధ్య గారు ,అడగగానే మీ అమ్మగారి గురించి తెలిపినందుకు థాంక్స్ అండి .

Sunday, October 11, 2009

సద్దాం ఆంటీ ఇంటి కథ

మీరు బుక్స్ చదువుతారా ? అని సడన్ గా అడిగింది సృజన . వచ్చే ప్రమాదాన్ని పసిగట్టలేక చాలా చదువుతాను కాని , తెలుగు వే చదువుతాను అని గొప్పగా చెప్పాను . ఐతే మేమొక కొత్త బ్లాగ్ మొదలుపెట్టాము , మీరు ఏదైనా పుస్తకము గురించి, దాని తో మీకున్న అనుబంధం గురించి వ్రాసి ఇవ్వండి అంది . నేనా ! రాయటమా ! మీకోసమా ! బోలెడు హాచర్యం , ఆపై ఘాభరా ! మీరంతా బాగా చేయి తిరిగిన వారు , నా రాత ఎలా వుంటుందో ? అనే అనుమానం వ్యక్తీకరించాను . పరవాలేదు మీరూ బాగానే రాస్తున్నారు , ప్రయత్నించండి , అంటూ మీ పిల్లలకి కతలు చెపుతారుగా అవే ఏదైనా రాయండి అని క్లూ ఇచ్చింది .నాకు వెంటనే బుడుగ్గాడు గుర్తుకొచ్చాడు .
వెంటనే బుడుగు గురించి రాసాను . కాని ఎలా పంపాలి ? అప్పుడూ సృజననే చెప్పింది జి . మేయిల్ లో పేస్ట్ చేసి పంపండి అని అదే చేసాను . ఇక అప్పటి నుండి టెన్షన్ పంపాను కాని వాళ్ళు వేసుకుంటారో వేసుకోరో ! బాగా లేదు అంటారో ! అని . సృజన దగ్గరనుండి మేయిల్ వస్తుందేమో నని పడిగాపులు. . మీ పొస్ట్ పబ్లిష్ చేసాము చూడండి అంటూ చివరికి చైతన్య కళ్యాణి మేయిల్ రానే వచ్చింది . అబ్బ ఎంత సంతోషమో ! మొదటిసారి అచ్చులో మన పేరు చూసుకుంటే కలగదేమిటి ?
ఆ తరువాత బారిష్టర్ పార్వతీశం రాసి పంపాను . అదీ అచ్చేసారు . వారికి పంపే ముందే , అప్పుడు నా టెస్ట్ బ్లాగ్ గా వున్న దీనిలో పోస్ట్ చేసుకొని , చూసుకొని పంపాను . ఆ తరువాత దీనిలోని ప్రయోగాలు నచ్చి , ఎలాగు పుస్తకాల గురించి వ్రాయటము మొదలు పెట్టాను కదా ఇందులో వ్రాద్దామనుకొని కంటిన్యూ అయిపోయాను .
ఇక ప్రస్తుతానికి వస్తే నేను వ్రాసిన, మల్లాది నవల , సద్దాం ఆంటీ ఇంటి కథ పరిచయం ముచ్చటగా మూడోసారి బి @ గ లో పబ్లిష్ చేసారు .
ప్రమాదాన్ని , ప్రమోదం గా మార్చిన
గీతాచార్య గారికి ,
చైతన్య కళ్యాణి కి ,
సృజన కి ,
ధన్యవాదాలు.
http://booksandgalfriends.blogspot.com/2009/10/blog-post_10.html

Tuesday, July 21, 2009

నా (మే ) టి మహిళ


శ్రీమతి.కె. వసంత గారు మావారి అక్కయ్య, మా పెద్ద ఆడపడుచు గారు. ఆవిడకి చాలా చిన్నతనము లోనే వివాహము జరిగింది. అయినా చదువును ఆపకుండా పట్టుదలతో యం.ఏ వరకూ చదివి, ఖమ్మం సిద్దారెడ్డి కాలేజీ లో లెక్చరర్ గా పని చేసి, ప్రస్తుతము రిటైర్మెంట్ తరువాత విశ్రాంతి తీసుకుంటున్నారు. బాల్యమునుండే కుటుంబ భాద్యతలు, చదువు, ఆ తరువాత వుద్యోగము నిర్వహించారు.కుటుంబ బాద్యతలు, వుద్యోగములోని పనివత్తిడి వున్నా వారి నలుగురు పిల్లల చదువు ,ఇతర అవసరాలు ఆవిడే చూసుకునే వారు.పిల్లల స్కూల్ లో ఏ కాంపిటీషన్ జరిగినా ,ఫాన్సీ డ్రస్స్ , వ్యాసరచన పోటీ ఇలా ఏదైనా పిల్లలను దానికి సిద్దము చేసి ,వారు పాల్గొనేట్టుగా చూసేవారు. చదువులోనూ సహాయము చేసేవారు.వారి అబ్బాయి రవి యం.యస్ చేసేందుకు మొదటిసారి యు.యస్ వెళ్ళేటప్పుడు ,అక్కడ ఏలా నడుచుకోవాలి మొదలైన విషయాలు కాసెట్ లో రికార్డ్ చేసి ఇచ్చారు. అది రవి నేగాక అతని స్నేహితులు కూడా విని ఆచరించారట. నలుగురు పిల్లలు కూడా పి.జి చేసి ఉన్నత ఉద్యోగములలో స్తిరపడ్డారు. ఇల్లాలుగా ,తల్లిగా ,ఉద్యోగినిగా అనుభవశాలి ఐన నాటి మహిళ మేటి మాట.
ఈ రోజుల్లో మనమంతా తీరిక లేకుండా కాలం గడుపుతున్నాము. విషయాలను ఆలోచించటానికి గాని ,చిన్న పిల్లలని చూసుకోవటానికి గాని ,వారికి మంచి మాటలు ,మంచినడత నేర్పించటానికి కాని సమయము లేదు.మన మనస్సులో వున్నదొకటి, చెప్పేదొకటి , చేసేదొకటిగా వుంటోంది. దీనికి తగ్గట్లే చాలావరకు అధికారము లో వున్న వారు కూడా అధికారం వచ్చేవరకున్నట్లు గా అధికారము లో కి వచ్చినతరువాత వుండటము లేదు. "యధా రాజా తధా ప్రజా". మనలని , మన రాజకీయ వాదులని చూసి పిల్లలు ఏమి నేర్చుకోవాలి ?

అంతా పోటీ ప్రపంచం . ఒక్క మార్క్ తో ముందుకు వెళ్ళాలన్న తపన పిల్లలలో పెంచుతున్నాము. వాడికి మార్కులు రాక సీట్ దొరక్కపోతే వేరే వాళ్ళతో పోల్చి కించ పరుస్తున్నాము.పిల్లలకు ఆటలాడు కోవటానికి , మన నాయకుల గురించి వినటానికి కాని , వారి గురించి చదువుకోవటానికి కాని సమయము లేదు.పెద్దవాళ్ళ మాటలలో వున్న సారాంశాన్ని గ్రహించే శ్రద్ద లేదు. ఎంతసేపూ మార్కులూ , సీట్లు . మార్కులు తక్కువ తెచ్చుకున్న వాళ్ళు , ఎంతో మంది జీవితములో అభివృద్దిని సాదించిన వారున్నారు.కాని , మంచి భావన , మంచి నడత మంచి పలుకు , మంచి పనులు లేకపోతే ఎంత చదివినా , ఎన్ని డిగ్రీలు పొందినా నిరుపయోగమే .మాటలను బట్టి ఒక మనిషి మనసును అంచనా వేయవచ్చు .మనం ఉన్నతం గా వుంటేనే ఉన్నతాశయాల గురించి ఆసక్తి చూపగలం .

నిజముగా పిల్లలకు ఎటువైపు వెళ్ళాలో తెలియని సాంఘిక వాతావరణము ప్రస్తుతము నెలకొల్పబడింది. ఆర్ధికాభివృద్ది ,మనిషికైనా దేశానికైనా అవసరమే .కాని స్వార్దాన్ని పెంచేదిగా వుండకూడదు. స్వార్దానికి బానిసలై అన్ని మరిచి అంధుల మవుతున్నాము.

మన సాంఘిక వ్యవస్థను చూసి విదేశీయులు ఇష్ట పడుతున్నారు. ముఖ్యముగా మన కుటుంబ వ్యవస్థ. ఐతే దీనిలో లోపాలు వుండవచ్చు. కాని ఈనాటి పిల్లలకు ,ఈ కుటుంబ వ్యవస్థ లో వున్నమంచి విషయాలు చెప్పాలి.దీన్ని కాపాడుకోవటానికి ప్రతివారు కృషి చేయాలి.

అర్ధము లేని మాటల తో ఇతరులను నొప్పించి ,ఆనందించటము పట్ల పిల్లలను ప్రోత్సహించ కూడదు. మన మాటల ప్రభావము తో బలహీన మనస్కులైన పిల్లలని ఉత్సాహపరిచి ,ఆత్మ విశ్వాసాన్ని పెంచి ఉన్నత స్తితికి తీసుకురావాలి . మాటల తో పొందు మన్ననలు అని పిల్లలకి మంచి మాటలు మాట్లాడటము చిన్న తనము నుంచే నేర్పాలి .
ఆర్ధిక వత్యాసాల ప్రభావం పిల్లలపై చిన్నతనములో పడితే వాళ్ళు సంఘానికి తెలియకుండా నే వ్యతిరేకులవుతారు.అది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది.ప్రస్తుతమున్న సంఘములో ఈ ఆర్ధిక వత్యాసాలు ఎక్కువగానే వున్నాయి. అవి తొలిగించుకొని పిల్లలందరికీ ఒకే రకమైన విద్యావిధానముండాలి. వాళ్ళ ప్రవర్తనలో కూడా ఈ వ్యత్యాసాలుండరాదు.ఇంట్లో కూడా సాద్యమైనంత వరకు పిల్లలకి సింపుల్ గా వుండటము నేర్పించాలి.

నేటి యువతరం డబ్బు సంపాదించాలనే తాపత్రయం తో గాడి తప్పుతున్నారు.భావితరాలకు మంచిని ,మన సంస్కృతిని అందించటానికి తీరిక లేకుండా సతమత మవుతున్నారు .వాళ్ళ ఆరోగ్యాలు దీనివల్ల దెబ్బ తింటున్నాయి. ఆహారపు అలవాట్లు మారి ఆరోగ్యాలలో మార్పులొస్తున్నాయి.ఇది చేధించగల శక్తి యువతకే వుంది. "డబ్బుకన్నా విలువలు ముఖ్యమైనవి ." అన్న విషయాన్ని వాళ్ళు మర్చి పోకుండా తరువాతి తరానికి కూడా అందించాలి . మనము, మన పిల్లలు , ఈ సంఘము లోని భాగాలమే . వ్యక్తులమే .దానికి భిన్నముగా మన పిల్లలని పెంచలేము.

అలాగే కుటుంబ సభ్యులమద్య ఆత్మీయత వుండాలి.అప్పుడే పిల్లలు వాళ్ళ సమస్యలను తల్లి తండ్రులతో పంచుకో గలుగుతారు. తల్లీ తండ్రి అంటే భయం కంటే , గౌరవం ప్రేమ ఎక్కువగా వుంటే ఆ పిల్లలో భద్రతాభావం పెరుగుతుంది.దాని తో వాళ్ళ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.అట్లాగని పిల్లలకు అతి స్వేచ్చ కూడా ఇవ్వరాదు. ఎందుకంటే బయటి ప్రపంచములో నేర ప్రవృత్తి బాగా వుండటాన ,ఆధునికత పేరున అనేక చిక్కులలో పడతారు.

ఇవన్నీ ఆలోచిస్తుంటే ,ఇదివరలో పది మంది పిల్లలున్నా తల్లితండ్రులు హాయిగా వున్నారు కాని ,ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లల తోనే చాలా జాగ్రత్తగా , సున్నితముగా వుండాల్సి వస్తుంది.ఈ నాటి పిల్లలేకదా రేపటి పౌరులు .కేవలం హక్కుల కోసం పోరాడేవారుగా కాక ,భాద్యతలను స్వీకరించగల సత్తా వారికుండేట్లుగా తీర్చి దిద్దే అవసరం వుంది.
విన్నారుగా నాటి మహిళ మేటి మాట . మరి మీ అభిప్రాయం ఏమిటి ?
థాంక్ యు వదినగారు.

Thursday, July 9, 2009

ఓయ్



మాలా,
ఏమిటి?
సినిమా కెళుదామా?
హడలిపోతూ చూసాను, అపుడెప్పుడో పి.వి.ఆర్ కి ఐదంతస్తులు ఎక్కి, దిగి వచ్చాక ఇక జన్మ లో నీతో సినిమాకి రానన్నారు, ఆ తరువాత ఈమద్య బిగ్ మాక్స్ లో ఏడంతస్తులు ఎక్కి, దిగి ప్రయాణం చూసచ్చాక ఇక నీతో సినిమాకి వస్తే అడుగు అని భీకరం గా ప్రతిజ్ఞ చేసి, ఇప్పుడు మళ్ళీ సినిమా అంటున్నారు, ఈసారి తొమ్మిది అంతస్తులు ఎక్కి దిగాలా !
నా భావాలన్ని మొహం మీద చూపించగల ప్రతిభ వున్నదాన్నవటము వలన, నా భయం మా అబ్బాయి అర్దము చేసుకొని, సినీ మాక్స్ కి వెళ్ళండి. అదైతే రెండంతస్తులే. ఎస్కలేటర్ కూడా వుంది అన్నాడు.అమ్మయ్య అనుకున్నా.
ఓయ్ సినిమా కి టికెట్స్ దొరికాయి. సిద్దార్ద హీరో .ఓ కే చూడవచ్చు.
వ్యతిరేకమైన భావాలు కల హీరో, హీరోయిన్.వారి పేర్లూ అంతే. ఉదయ్, సంద్య. ఉదయ్ ,ఉదయము ఒక దేశం లో రాత్రి ఒక దేశము లో, సంధర్భము ఉన్నా లేకపొయినా పార్టీ లు చేసుకుంటూ కులాశాగా గడిపే ధనవంతుల బిడ్డ. సంద్య ఏమో ఉదయమే లేచి యోగా చేసి, గుడికి వెళుతూ, తనకున్న చిన్న ఇంట్లో చెట్లను పెంచుకుంటూ చుట్టు పక్కలవారి తో కూడా దూరంగా వుంటూ సిస్టమాటిక్ గా జీవితం సాగించే యువతి. ఉదయ్ కి స్వీట్ అండ్ షార్ట్ మెమొరీస్ కావాలి.కాని సంధ్య కి ఏ గుర్తైనా జీవితాంతము గుర్తుండేది గా వుండాలి.స్నేహితురాలి బలవంతము మీద న్యూ ఇయర్ పార్టీ కి వెళ్ళిన సంద్యను చూస్తాడు ,ఉదయ్.ఇక అప్పటి నుంచి ఆమె ప్రేమ లో పడిపోయి, ఆమెను గెలుచుకోవటము కోసం పడరాని పాట్లు పడటమే సినిమా. చివరికి ఏమవుతుంది ? సంధ్య కూడా ఉదయ్ ని ప్రేమిస్తుందా లేదా,ఇద్దరి కి పెళ్ళవుతుందా లేదా అన్నది సినిమా చూసి తెలుసు కోవలసిందే !

ఉదయ్ గా సిద్దార్ద ,లవర్ బాయ్ లా ముద్దుగా వున్నాడు. షామిలి బొద్దుగా ,ముద్దుగా అలనాటి హీరోయినల్లు,సావిత్రి, క్రిష్ణ కుమారి లా చక్కగా హోంలీ గా వుంది.మూడుగంటల సినిమా అయినా బోర్ కొట్టలేదు. రొటీన్ తెలుగు సినిమా కి భిన్నం గా వుంది.మొదటి సగము సరదాగా ,రెండో సగము కొంచము భారం గా వుంది. చాలా చాలా నీట్ గా వుంది ! వెకిలి వేషాలూ, వెకిలి కామెడీ లేవు. దర్శకుడు ఆనంద్ రంగా బాయ్ మీట్ గర్ల్ కథను కొత్తగా ,నీట్ చెప్పటాని కి చేసిన ప్రయత్నము నాకు నచ్చింది. అంతా బాగుంది కాని, పాటలే సంగీతము, సాహిత్యమూ రెండూ నాకర్ధము కాలేదు. కనీసము ఒక్క పాటైనా మెలొడీది పెడితే బాగుండేది. అదేమిటో పాపం ఈ సినిమా లో హీరోయిన్ కి బట్టలు నిండుగా వేసారు ! పాటలలో కూడా హీరో గారి మీద పడటము వగైరా చేయలేదు . . .)) బహుశా కింద పడటాలు, మీద పడటాలు లేకపొబట్టి, హీరోయిన్ వంటి నిండా బట్టలు కట్టుకో వటము వలనా చాలామంది కి నచ్చక పోవచ్చు.ఇది మటుకు దర్షకుడు ప్రయోగము చేసాడనే అనవచ్చు.
సినిమా పేరు చూడగానే ఇది లవ్ స్టోరీ అని తెలిసి పోతుంది. కాబట్టి ,ఇందులో డైరెక్టర్ ఆ కథను మలచిన విధానమును చూడాలి,హీరో ,హీరోయిన్ లను చూసి పాప్ కార్న్ తిని రావాలే కాని, సందేశాల కోసం చూడకూడదు.అల్లాంటివి కావాలంటే దీనికి పోక పోవటము బెటర్.
నాకైతే సినిమా నచ్చింది. కాకపొతే నాకు నచ్చిన సినిమా ఎవరికీ నచ్చదు ! దానితో పాటు థియేటర్ కూడా నచ్చింది. ఎక్కువ మెట్లు ఎక్కే పని లేదు. పైగా 200 రూపాయల టికెట్ కొన్నుకుంటే హాయిగా ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని చూసినట్లు ,పడక కుర్చీ లో కూర్చొని చూడవచ్చు.

Sunday, July 5, 2009

పరిచయం

కొత్త కొత్త వి నేర్చు కొవటము కోసం ఈ బ్లాగ్ ని మొదలు పెట్టాను. చిన్నగా వున్నప్పుడే గా అ ఆ లు నేరుచుకునేది.అందుకే దీని కి పెళ్లి కి ముందు పేరు తో ఐ.డి చేసుకున్నాను.కాని నేర్చుకున్నది పెళ్లి తరువాతే గా !అందుకే మా వారి పేరు ,నా పేరు కలిపి పేరు పెట్టుకున్నాను.ఆహా ఏమి తెలివి!

అన్ని కూర్చి చూసుకున్నాక చాలా ముద్దుగా అనిపించింది.నా ఈ మానస పుత్రికను అలా వదిలేయ లేక ఎం చేయాలా అని ఆలోచించాక, బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం రాసిన బుడుగు,బారిస్టర్ పార్వతీశం చూసాక (ఇందులో ముందుగా పోస్ట్ చేసి చూసుకున్నాను.తరువాత వాళ్ళకి పంపాను)ఎలాగూ నేను చదివిన పుస్తకాల గురించి ,సినిమాల గురిచి రాసుకుండా మను కుంటున్నాను,ఇందులోనే రాస్తే పోలే అనుకున్నాను.అందుకే ఈ ప్రయత్నం.

Tuesday, June 23, 2009

బుడుగు

మా అమ్మ మాలతి చందూర్ కి చాలా పెద్ద ఫాన్.ఆవిడ లాగా మేము కూడా బాగా తెలివికల వాళ్ళము కావాలని మాచిన్నప్పుడు చాలా పుస్తకాలు చదివించేది.అది ఒక వ్యసనమైపోయిమేము వూరు వెళ్ళినా ఏఇల్లు మారినా దగ్గర లో లైబ్రరి వెతుక్కుంటాను.మేము అక్కడినుంచి వెళ్ళిపోయాక లైబ్రరి వాళ్ళు నాకోసం చాలా బెగెట్టేసుకుంటారు.ఇప్పటికీ నారాయణగూడా ఆర్.కే లైబ్రరి రషీద్ ,అప్పుడప్పుడూ ఫొన్ చేసి కుశలం అడుగుతుంటాడు.పాపం వాళ్ళ డాడీ అయితేనాకు పుస్తకాలు సరఫరా చేయలేక అబ్ మేరేకొ కితాబ్ చాప్నా పడేగా అని వాపొయేవాడు. అయితే చాపొ అన్నాను .ఆప్లిఖొ మై చాపూంగా అనేవాడు.

ఇంకా పనికి మాలిన నవలలు చదువుతావు మంచి పుస్తకాలు చదువు అని మా అమ్మ కోపం చేస్తుంది.నేనేమన్నాచిన్నదానా చితకదాన్నా!నా అంతటి దాన్నినేనయ్యను.ఇంకా సమగ్ర ఆంద్ర చరిత్ర చదువూ,కళాపూర్ణొదయం చదువూఅని కోపం చేయటానికి ? మాట కొస్తే నా మనవళ్ళూ ,మనవరాళ్ళూ కూడా వొప్పుకోరు,వాళ్ళూబెద్దవాళ్ళమయ్యమంటారు.అందరికంటే చిన్నవాడు గౌరవ్ వున్నాడా ,బుడుగు పుస్తకం లోని పేజీ అయినా తీసిఇవ్వండి టక టకా చదివేస్తాడు.వాడి కి ఐదేళ్ళే ఎలా చదువుతాడని అనుమాన మక్కరలెదు. మద్య తెలుగునేర్చుకుంటున్నాడు .అం అహ దకా వచ్చేసాయి. వాడి దగ్గర ఎంతమంది టీచరమ్మలు పనిచేసారో తెలుసా !పాపం వాళ్ళుమీ గౌరవ్ కి చెప్పలేము అని కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకునెవారు. కాని ఇప్పుడు వచ్చిన ప్రైవేటు టేచరమ్మ చాలాముదురు.వాడు ఎక్కడ దాక్కున్నా వెతికి చంకలో ఇరికించుకొని తీసుకెళుతుంది.నువ్వు నన్ను హాండిల్ చేయలేవుఅన్నాడే అనుకోండి.అదేమిటో నా ఇంకో మనవడు విక్కీ దగ్గర కూడా చాలా మంది పనిచేసారు. మీకు చెబితే హాచర్యపోతారు.వాళ్ళూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నే వెళ్ళిపోయారు.బురుగు లాగా పట్టీల నిక్కరు వేసుకుందా మను కున్నామాఎక్కడా దొరకలేదు.అంత పెద్ద అమెరికా లో వెతికానా (పట్టీలు అనకూడదుట. సస్పెండర్ అనాలిట) ఎక్కడాదొరకలేదు.కాపోతే తాత కి దొరికాయి.పక్కింటాయన వెళుతుంటే ఈయన పకింటి పిన్నిగారి మొగుడు అంటేతప్పేమిటి?అలా చూస్తాడు.మాకు గద కావాలంటే వద్దు అంటారు,కుక్క తో ఆడుకుంటా మంటే వద్దు అంటారు ,అబ్బబ్బా బెద్దవాళ్ళతో వేగలేక పోతున్నామంటే నమ్మండి.పోనీ ఈల వేద్దామంటే బాబాయిలు వాళ్ళే ఈలలేసుకొని పెళ్ళిచేసేసుకొన్నారు. మీ కెవరికైనా కావలంటే చెప్పండి ,ఘట్టిగా ఈలవేస్తాము.కాపొతే మీ వూళ్ళో జటకా బండి వుంటే చెప్పలిమరి ,మేం వచ్చి ఎక్కుతాం .మాకు ఎవరో నెత్తిన గోరింకా పాటకూడా వచ్చు.ఇంకా అలడీన్ ఖథ పాపాయి ఖథా వచ్చు. బోలెడు అవిడియాలూ ,అభిప్రాయాలూ వున్నాయి కావలంటే మీకూ చెబుతాము.మేమే బుడుగు బుడుగేమేమన్నమాట.జోరుగ గుంజు హైలెస్సా అన్నా విడిపోము.

మీకు తెలుసా!బుడుగు పుస్తకము కోసము నేను నైంటీన్ నైన్ సిక్ష్ నుంచి డికెష్టింగ్ చేస్తే ,టుతౌసండ్ టు లో విశాలాంద్రాపుస్తక ప్రపంచం లో దొరికిందన్నమాట. మేము ఒకటో ఐదో ప్పదో కొన్నాము .మా స్నేహితులందరికీఇచ్చాము.పపంచం లోని పిల్లలంతా బురుగులు(పిడుగులు)కావాలని మా అభిప్రాయం.మీరూ తొందరగా కొనేసి మీపిల్లలకి ఇవ్వండి,మీరూ చదవండి.విశాలాంద్రా పుస్తకాలయాని కి వెళ్ళి మా పేరు చెప్పండి,కుంచం రాయతీఇస్తారు.జాఠర్ ఢమాల్!

ముళ్ళపూడి వెంకటరమణ, బాపు లకు బోలెడు థాంకులు.

అవకాశమిచ్చిన రెండు జళ్ళ చైతీ కి థాంకు, శుభాశీషులు.

బారిస్టర్ పార్వతీశం



బారిష్టర్ పార్వతీశం
మొక్కపాటి నరసిం హ శాస్త్రి
బాపు ,ముళ్ళపూడి వెంకట రమణల బుడుగు,చిలకమర్తి నరసిం హ శాస్త్రి గణపతి, మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి బారిష్టర్పార్వతీశం ,రవీంద్ర నాథ్ ఠాగూర్ నౌకా ప్రమాదం(మునక? )ల కోసం చాలా సంవత్సరాలుగా వెతుకుతుండగా ఆరుసంవత్సరాల క్రితం బుడుగు,ఈ మద్య గణపతి, బారిష్టర్ పార్వతీశం దొరికాయి.చిన్నప్పుడు చదివిన ఈనవలలు, మళ్ళీచదవాలనే కోరికనే ఇంతలా వెతికించింది.బారిష్టర్ పార్వతీశం పుస్త్తకం ,కొద్దిగా చినిగి పాతపడిన ప్రతిని ,పాపం విశాలాంద్రలోని మేడం నా కోసం వెతికి ఇచ్చారు.అదే మహా ప్రసాదం అని తీసుకున్నాను.

ఈ నవలని శాస్త్రి గారు 1924 న రచించారు.ఈ రచనకుదారి తీసిన విధానాలు ,ఎలా రాసారు ఈ నవల ముందుఅంతరంగం లో ఆయన ప్రియ శిష్యుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు వివరించారు.బారిస్టర్ పార్వతీశాన్ని శ్లాఘించే శ్రీ శ్రీగారి పద్యము తో అంతరంగాన్ని ముగించారు.ఆ పధ్యము:
క్షితి లో బారిస్టర్ పార్వతీశము ను చెప్పి,పిదప పలుకవలె కదా
కితకితల కితరులను భా
సిత సిత సుశ్లోకు డతడు సిరిసిరి మువ్వా!
శ్రీకాంత శర్మ గారి, ముళ్ళపుడి వెంకట రమణ గారి అంతరంగం,శ్రీ శ్రీ గారి పద్యము వందన్నర బొమ్మలు ,జోకులు ఈనవల కు స్పెషల్ అట్రాక్షన్.
లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి దేశాని కి సేవ చేయాలనీఅరాటము,ఉబలాటము,ఉత్సాహం కల ఆంద్ర సనాతన బ్రాహ్మణకుటుంబాని కి చెందిన యువకుడే పార్వతీశం.నవలంతా పార్వతీశం స్వీయ కథ చెబుతున్నట్లుగా వుంటుంది.
మాది మొగల్తూర్ లెండి .మొగల్తూర్ అంటే ఏమనుకున్నారో చరిత్రలో ప్రసిద్ది కెక్కిన మహానగరం (ఓ అప్పటి నుండేప్రస్సిద్దా!)
అని పార్వతీశం కథ చెప్పటము మొదలు పెడతాడు. ఆ ఊరి వారందరికీ పార్వతీశం అంటే తెగముద్దు. అక్కడచదువయ్యాక నర్సాపురం లో టైలరు స్కూల్ లో ఫస్ట్ ఫార్మ్ లో చేరుతాడు. ఇక అక్కడ ఏర్పడిన వివిధ పరిచయాలు, అనుభవాల రీత్యా లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకుంటాడు. మొగల్తూర్ లో బయిలుదేరిన పార్వతీశంఇంగ్లాండ్ లో అడుగు మొపటము,అతను స్కాట్లండ్ లో ని ఎడింబరో విశ్వవిద్యాలయము లో ఏం.ఏ కోర్స్ చదువుతూప్రక్కగా బారిష్టర్ పరీక్ష కి చదివి ఈ కాలం లో ఇంగ్లాండ్ లో రకరకాల అనుభవాలు గడించి ,ఒక దొరసాని పిల్ల ప్రేమకుపాత్రుడై ,మొదటి ప్రపంచ యుద్దపు(1917) చివరి సంవత్సరం బారిష్టర్ పార్వతీశం గా అవతరించి,ఇండియా కి ఓడలోరావటము,స్వగ్రామం చేరి సరస్వతి అనే అమ్మాయి ని పెళ్ళాడి,టంగుటూరి ప్రకాశం పంతులుగారి దగ్గర మద్రాసు లోఅప్రెంటిస్ గిరి పూర్తి చేసుకొని ,ఆ మీదట భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై అటువైపుగా కొంత కాలం నడిచిమామగారి సౌజన్యాన్ని ఆసరా చేసుకొని,తన జీవితం గురించి,కర్తవ్యం గురించి విజ్ఞత తో ఆలోచించి ,చివరకు తన ప్లీడరీవృత్తిని విడిచి,భార్య సరస్వతి తో మొగల్తూర్ వెళ్ళి,ఉన్న ఆస్తి పాస్తు లను చూసుకో వటము తో నవల ముగుస్తుంది.

ఆంగ్లేయ విద్య తో పాటు అబ్బవలసిన అనేక సుగుణాలు ఆనాటికి ఇతని లో కొరత పడినాయి.నేటి నాగరికత అంతాకొత్త.ఎన్నడూ రైలెక్కి కూడా ఎరుగడు. రైల్ ఎక్కినది మొదలూ అడుగడుగునా విపరీత పరిస్థితులే తారసిల్లిఎక్కడికక్కడే అతనిని మూర్ఖుడుగా చేసి ,ప్రపంచమే తలకిందులుగా అయినట్టు, రైల్ లో అతడు నడచిన నడత ,మద్రాస్లో అతను పడిన యిబ్బందులు,స్టీమర్ లో అతను పడిన అవస్థలు, కొత్త ప్రదేశాలలో అతడు పడిన చిక్కులు అన్నీ చదివితీరవలసిందే.కడుపు చెక్కలయ్యెంతగా నవ్వించి,ఒక ఘట్టాని మించి ఒక ఘట్టం హాస్య ప్రధానం గా వుంటాయి.

పాత్ర స్వభావతగా మూర్ఖుడు కాడు.పరిస్థితులతనిని మూర్ఖుని గా చేసి వెక్కిరిస్తూవుంటాయి.ఈ పార్వతీశాన్ని మించినవ్వుల పాలైన అవస్థలు మనం కూడా జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే! అందుకే ఈ పాత్రంటే మనకుమమత ,అభిమానం,సానుభూతి కలుగుతాయి.
మొత్తం నవల అంతా ఏకబిగిన చదివిస్తుంది.పాత కాలం రచన కదా భాష ఎలా వుంటుందో అని భయపడక్కరలేదు.సరళమైన వ్యవహావారిక భాష లోనే వుంది. ఇంకో మాట,టి.వి ప్రేక్షకులు కూడా ఈ పుస్తకాన్ని నిఝంగా కొనేసిచదువుతే ,టి.వి లో కన్నా గొప్ప చిత్రాలు కనిపిస్తాయని,కరెంట్ కరుసు వుండదని ముళ్ళపూడి వారు గారెంటీఇచ్చారు.ఇంకెందుకు ఆలస్యం కొని చదివేస్తేబాగుంటుంది కదా! ధర కుడా ఎక్కువేమీ కాదు 333 రూపాయలు మాత్రమే.

Wednesday, June 10, 2009




గుర్రమెక్కి దర్జాగా పదకొండో సంవత్సరము లో కి ప్రవేసిస్తున్న విక్కీ కి


Friday, May 15, 2009

అమ్మ

అమ్మ లోని వివిధ రూపాలు .














అమ్మ ప్రేమ కి పేదరికము కాదు అవరోధము.






Tuesday, May 12, 2009

సౌరాష్ట్ర




సోమనాథ్ దేవాలయము





గాంధి నివాసము








వెనకాల కస్తూరిబా నివాసము

Sunday, May 10, 2009

అమ్మ











అమ్మ భుజాని కి మించిన బంగారు పానుపు వుందా!

అమ్మ



చిన్నారీ ,పొన్నారీ పాపాయి,
ముద్దులా,మురిపాలా పాపాయీ,
నిను చూసీ మురిసే అమ్మ.
ముత్యాలూ,రతనాలూ కలబోసీ
అమ్మ కడుపు చల్లగా , అత్త కడుపు చల్లగా ,
నిండుగా నూరేళ్ళూ వుండాలని,
దీవించే అమ్మ.

Wednesday, May 6, 2009

గతవైభవం



గతమెంతో కీర్తి కలది

gulaabi



ఓహో గులాబి బాలా

Sunday, May 3, 2009



కొండలలో నెలకొన్న కొనేటిరాయడు వీడూ



కొండలంత బలమును ఇచ్చెటి వాడు
kudali



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

Sunday, April 26, 2009

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి