Wednesday, December 22, 2010

జ్యోతి కి పుట్టిన రోజు జేజేలు
సహజం గా ఎవరికి ఐనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే చాలా సులువుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పేస్తాము. . కాని ఎందరికో ఎప్పట్నుండో తెలిసి, నాకు ఈ మధ్య నే పరిచయం ఐన వ్యక్తి జ్యోతి గారు..
ఈనాడు ఆదివారం మాగజైన్ లో ఒకసారి తెలుగు బ్లాగులు గురించి చదివి చాలా ఆనందించాను..సాహిత్యం అంటే నాకు ఉన్న ఇష్టం అలాంటిది..అప్పట్నుంచి తెలుగు భాష గురించి కంప్యూటర్ లో వెదుకుతూ వుండేదాన్ని.. ఒకరోజు అనుకోకుండా లీలామోహనం అనే బ్లాగు కనబడింది.. ఏమని చెప్పను నా ఆనందం ?
ఆ బ్లాగు ద్వారా మరికొన్ని బ్లాగులు చూడడం జరిగింది......అప్పుడు చూసాను ఒక బ్లాగులో కొన్ని పదాలు......
ఒక రచయిత్రి తన మనోభావాలు వెల్లడించిన పదాలు. . నన్ను ఆకర్షించాయి.. ఆ బ్లాగు ద్వారా మరికొన్నిబ్లాగులు పరిమళం, అమ్మ ఒడి...ఇంకా ఎన్నో .. అంతటితో ఆగని నేను ఒక బ్లాగుకి శ్రీకారం చుట్టాను.
కాని కొన్ని అంతరాయాలు. ఆగిపోయాను.. ఎందుకంటే ఎంతోమంది బ్లాగులు మెయింటైన్ చేస్తున్నారు.. అన్ని అందమైన భావాల మధ్య నేను నా బ్లాగుకి న్యాయం చేకూర్చలేను అనిపించింది.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు జ్యోతిగారితో మాట్లాడడం జరిగింది..సహజంగానే ఎవరైనా ఇంకొకరికి సహాయం చెయ్యాలంటే వెనకాడతారు ఎంత తెలిసినవారైనా..కాని మొదటి పరిచయంలోనే (మెయిల్ ద్వారా) మాట్లాడిన నాకు జ్యోతిగారు నా బ్లాగుని మరల మొదలు పెట్టేలా తనే డిజైన్ చేసి, నేను ఏమాత్రం శ్రమ పడకుండా నా భావాలు పంచుకునే అవకాశం కల్పించారు.. ప్రమదావనం అనే గ్రూప్ కి పరిచయంచేసి, జీవితం అంటే ఒంటరి ఆలోచనల ముళ్ళపొద కాకుండా మరి కొందరి మనోభావాల సందడిలో పాలు పంచుకునేలా చేశారు.. అందరూ అల్లరి చేస్తున్నా తను మాత్రం చుక్కల్లో చంద్రుడిలా అప్పుడప్పుడూ ప్రత్యక్షమౌతూ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ అందరికీ ప్రాముఖ్యత ఇస్తారు..
దట్ ఈజ్ వాట్ ఐ కాల్ " ఏ గుడ్ లీడర్ షిప్".... నవరసాల కధానాయికలలా తన బ్లాగుల్లో రకరకాల
భావాల రుచులు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు.. ఏందీ సెల్లు లొల్లి అన్నా, గుత్తొంకాయ కూరోయ్ అన్నా ఆమెకే చెల్లు.., కాదేదీ జ్యోతికి అసాధ్యం అని నిరూపిస్తూ అప్పుడప్పుడూ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కనిపిస్తూ, తరచుగా ఆమె ఎక్కడ కనిపిస్తారా అని వెదికితే చాలు , ప్రత్యక్షమౌతూ ఉంటారు.... సాక్షి , ఈనాడు శని, ఆదివారాల మాగజైన్ లలో. . ప్రతి మనిషి కుటుంబ బరువు, భాద్యతలతో పాటు తన గురించి తాను ఆలోచించుకుంటూ "నాకై నేను" అనే భావనతో ఆనందంగా జీవితాన్ని " బ్రతకడం కాదు జీవించడం ముఖ్యం" అని నిరూపించుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది.. ఆ జీవితాన్ని జ్యోతి గారు సాధించారు అనిపిస్తుంది.. అదే నిజమైతే నా హార్ధిక అభినందనలు జ్యోతిగారికి...
పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతిగారు..ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ................................................ రుక్మిణీదేవి...

Wednesday, December 8, 2010

కదంబమాలిక - 2

బ్లాగులో రాసేది ఒకే పోస్టు . ఒకే అంశం. లేదా ఒకే కథ.. కాని పది మంది కలిసి ఒకే కథను రాస్తే. అదే ఒక్కో పుష్పం కలిసి తయారు చేసే అందమైన కదంబమాలిక. అలాగే ఈ బ్లాగర్లు ప్రతి వారం ఒక్కొరుగా ఈ కథను అందిపుచ్చుకుని కొనసాగిస్తారు . కొత్తగా చేయాలనే కోరికతో ప్రమదావనం సభ్యులు కొందరు చేసే ఈ ప్రయోగాన్ని మీరు సహృదయంతో పరిశీలించి, సరిదిద్ది, ప్రోత్సహిస్తారని కోరుతున్నాను..
ఈ కదంబమాలిక ను జ్ఞానప్రసునగారు , సురుచిలో ప్రారంభించగా , దానిని అందిపుచ్చుకొని ఈ వారము కొనసాగిస్తున్నారు మమత రెడ్డి .

* * * * * * * * ** * * * * * * * * * * * * * * * * * * *

అలా వెళ్ళిన సుభధ్రకి జానకి ఏడుస్తూ కనపడింది.... సుభధ్ర జానకిని దగ్గరికి తీసుకొని "పర్లేదులే నేను కూడా బట్టలు ఆరేస్తాను..నాతోరా" అంది . "వద్దక్కా, పని ఉంది చెయ్యాలి. చెయ్యకపోతే అమ్మగారికి కోపం వస్తూంది" అని బెదిరే కళ్ళతో అంది జానకి."నేను చెప్తాను నారాయణమ్మకి" అని జానకి చెయ్యి పట్టుకొని తన వెంట తీసుకెల్లింది సుభధ్ర. జానకిని తన గదిలో కూర్చోబెట్టి చక్కెరపొంగలి తినమని పెట్టింది..."వద్దక్కా"అంటే "తిను జానకి ఎవరు ఎమీ అనరులే"అని జానకి పక్కగా కూర్చుంది."నువ్వు బడికి వెళ్ళట్లేదా?" అని సుభధ్ర అడిగింది. "వెళ్ళేదానిని కాని మానిపించేసారు..మాకు డబ్బులు లేవంట అమ్మ చెప్పింది"అని ఆత్రంగా ప్రసాదం తింటూ చెప్పింది జానకి. ఆ సమయంలో జానకి కళ్ళు చూస్తేనే తెలుస్తుంది బాగా ఆకలి మీద ఉందని..వెంటనే పక్కనే ఉన్న ఆపిల్ పండుని తీసి తినమని ఇచ్చింది సుభద్ర. అలా తింటున్న జానకి కళ్ళల్లో సంతృప్తిని చూసి సుభధ్రకి ఏదో తెలియని భావన కలిగింది, అది ఏదో సంతొషం లాగా...ప్రొద్దున ప్రొద్దున్నే కూసే పిట్టలా అనందం లాగ..అప్పుడే పుట్టిన లేడి పిల్ల అనందంతో చెంగు చెంగున ఎగిరే లాగ.


సుభధ్ర మెల్లగా తన ఆలోచనలలోకి వెళ్ళిపోయింది. నారాయణమ్మగారికి భర్త రిటైరయ్యి 2 ఏళ్ళు అవుతుంది. ఒక కొడుకు, కూతురు.. ఇద్దరికి పెళ్ళిల్లు అయిపొయాయి..కూతురు అమెరికాలో ఉంటుంది...కొడుకు ఇక్కడే బ్యాంకులో మానేజర్ గా చేస్తున్నాడు. కోడలు సరోజిని.. నారాయణమ్మ గారికి పూజలు, పునస్కారాలు ఎక్కువ. 24 గంటలూ దైవనామస్మరణ చెయ్యమన్నా చేస్తూనే ఉంటారు.. అప్పుడప్పుడు మనవళ్ళతో కాలక్షేపం. రోజూ పొద్దున్నే పూజ చెయ్యనిదే నీరైన ముట్టరు.. నారాయణమ్మ కోడలు సరోజిని చాల మంచిది.. నారాయణమ్మ అంత పూజల పిచ్చిలేదు కాని అత్తకి అన్ని పనుల్లో సహాయంగా ఉంటుంది. ఓపిక, సహనం ఎక్కువే. అప్పుడప్పుడు వాళ్ల పనిమనిషి లక్షమ్మ ఒంట్లో బాగులేకుంటే తన కూతురును పనికి పంపిస్తుంది. ఈరోజు జానకి తల్లికి జ్వరం అని పొద్దున్నే పనికి వచ్చింధి. అలవాటు లేని పని కాబట్టి యజమానురాలితో తిట్లు తినక తప్పడంలేదు..


"అక్కా! అక్కా!" ఉలిక్కి పడి తన ఆలోచనలనుండి బయటకొచ్చింది సుభధ్ర జానకి పిలుపుతో. ఏంటి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తే.."మంచి నీళ్ళు కావాలక్కా!"అంది జానకి. సుభధ్ర మంచి నీళ్ళు తేవటానికి వంటింట్లోకి వెళ్ళింది.. నీళ్ళు తెచ్చి వచ్చి చూస్తే..జానకి తన గదిలో ఉన్న బొమ్మల పుస్తకం చదవడానికి ప్రయత్నం చేస్తుంది. అది చూసి సుభధ్రకి ముచ్చటేసి "ఎంటే జానకి నీకు చదువుకోవటం అంటే ఇష్టమా?.. చదువుకుంటావా బడికి పంపితే". ఈ మాట వినగానే రెప్పలు అల్లారుస్తూ ఊ అని తల పైకెత్తింది జానకి.. అప్పుడు సుభధ్రకి ఆ కళ్ళల్లొ చదువుకుంటావా? అనగానే కనపడ్డ ఆనందం.. ఆ అమాయకపు చూపులు చూసి అలా జానకి బుగ్గ లాగింది ప్రేమగా. సుభధ్రకి 4 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. సుభధ్ర నాన్న వెంకటాచలంకి కిరాణ కొట్టు ఉంది.. తన కూతురుని చూసుకొటానికి అతని చెల్లెలు శారద వాళ్ళ కుటుంబం తనతో పాటే కలిసి ఉంటున్నారు. శారద భర్త సుబ్బారావు డ్రైవర్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు రాణి, వాసు. సుభధ్ర కంటె చిన్న వాళ్ళే. వాసు అల్లరి చేయ్యడంలొ ధిట్ట. రాణి మాత్రం చాలా నెమ్మదస్తురాలు.. కాని ఇద్దరు చదువుల్లో అందరికంటే ముందే ఉంటారు.

ఇంతలో బయటనుండి కేకలు వినపడుతున్నాయి..."ఒసేయ్ జానకి ఎక్కడ ఉన్నావే?. ఈ గిన్నెలు ఎప్పుడే కడిగేది? ఏం పిల్లనో ఏమో ఎప్పుడూ పని తప్పించుకుందాం అని చూస్తుంది. అనవసరమైన భారం మాకు. అన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది". ఆ ఖంగుమనే గొంతు నారాయణమ్మది. జానకి గబ గబా పరిగెత్తుకుంటు కిందకి వెళ్ళింది.. జానకిని చూడగానే నారాయణమ్మ గొంతు ఇంకా పెద్దదైంది.. అప్పుడు సుభధ్ర "నేనే తీసుకొచ్చానండి, ఇంట్లో కొంచం పని ఉంటే..మీకు చెప్పుదాం అంటే మీరు పూజలో ఉన్నారు అందుకే సరోజినిగారికి చెప్పి తీసుకెళ్లాను"అని నారాయణమ్మ చూడకుండా సరోజినికి తన కళ్ళతోనే సమాదానం చెప్పింది. సరోజిని అర్ధం చేసుకుని చిన్నగా నవ్వి..."హా అవును సుభద్ర నాకు చెప్పింది అత్తయ్యా!". సుభధ్ర తన కళ్ళతోనే సరోజినికి కృతజ్ఞతలు చెప్పి మెల్లగా తన గదిలోకి వెళ్ళింది. కృష్ణయ్య ఎదురుగా కూర్చొని "కృష్ణయ్యా! నీకు తెలిసినంతగా నాకు తెలియదే..ఇలాగ చేయొచ్చా? ఇలాగేనా? చిన్న పిల్లలతో పని చేయించుకోవడం. పిల్లలు దైవస్వరూపులు అంటారు కదా.. మరి ఏంటిది? అన్ని తెలిసి కూడ ఇలా చిన్న పిల్లలతో పని చేయించుకోవడం బాగుందా చెప్పు?...హాయిగా ఆడుతూ..చదువుకోవాల్సిన వయస్సులో వాళ్ళని పని పేరుతో కట్టడి చెయ్యడం" అని అడుగుతూ కృష్ణయ్య బొమ్మను చూస్తూ ఉంది. కృష్ణున్ని కళ్ళల్లో ఆ ప్రశాంతత. ఆ చిరునవ్వు. .తనకి ఏదో తెలియని మధురానుభూతి కలిగింది."కృష్ణయ్యా! ఈ పెద్దవాళ్లకి ఙ్ఞానోదయం అయ్యే మార్గం చూపించవయ్యా!" అనుకుంటూ..అలా చూస్తూనే ఉంది...


( సశేషం )


వచ్చే వారం సాహితి లో కలుద్దాము .

Wednesday, December 1, 2010

కవిత

ఆనందంలో మనసు తేలియాడినపుడు
తెరలు తెరలుగ తేలివస్తుంది కవిత

విషాదంలో మది ఈదులాడినపుడు
పొరలి పొరలి పొగిలివస్తుంది కవిత

భావోద్రేకంలో హ్రుదయం స్పందించిన
వీరుని మదిలొ వెలిగేను విప్లవ కవిత

ప్రేయసి గుండెలో ప్రేమ పొంగిన
అనురాగపు మదిన అమరమైన కవిత

యిన్ని రీతుల యిలను రూపకల్పనలై
భాసిల్లుతున్న వేల కవితాలతలున్న వేళ

నామదియందు భావనారూపమయిన ఈ కవిత
అనిపించునా నీకు అసంకల్పిత

దేవి....థాంక్ యు దేవి .

Tuesday, October 12, 2010

గూటిలోని గువ్వా

కనురెప్పలమాటునున్న కన్నీరా ,,,

ఆగిపోమ్మా అక్కడే .

నీ కన్నీరు కారాదు అభివృద్ధి కి ఆటంకం ,

రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోక తప్పదు ,

రెక్కలు రాని పసికూనలు అమ్మానాన్న తో పోకా తప్పదు ,

రెక్కలు అలసిన పక్షి గూటిలోనే వుండకా తప్పదు ,

అన్నీ తెలిసీ ఎందుకీ భాధ ??????

Tuesday, July 13, 2010

మా మామయ్య

కళ్యాణ వధువుగా పారాణి పాదంతో...

ఈయింట అడుగు పెట్టిననాడు....

"నేటినుండి నీవూ తనయవెతల్లీ" అంటూ....

తలనిమిరి ఆశీస్సులుంచారు .


పనివేళ అమ్మకాళ్ళకు అడ్డుపడె పసివాడిలా

వచ్చిఅత్తగారున్నారేమో.. అని అటు యిటు చూచి,

అమ్మా.... ఒక్కసిప్.... అని అడిగే మామయ్య

పసివారిలా తొచేవారు .

ఎవ్వరినీ నొప్పించక, పరులంటూ భావించక

పదిమందినీ యింటచూసి పరవశించే మామయ్య

పరమాత్మునిలా అనిపించేవారు.

రామకోటి రాస్తూ, రాముడంతటి సౌజన్యమూర్తి ఆయన

ఆమహామనిషి అమృత హృదయాన్ని

అభినందించని వారుంటే... వారు

పాపాత్ములంటే పాపము రాదేమో ! పాపము కాదేమో !!

'మాధవరావంటే "మాధవుడె" అని

మనసారా మెచ్చుకోని మహాత్ములయిన వారెందరో !

అరవయ్యేళ్ళువచ్హినా ఆరునెలల పాపలా పాపమెరుగక

శ్రీహరినే దోచుకోగల ధన్యజీవి మామయ్య

స్వర్ధరహిత స్వచ్చతకు నిదర్శనం

ఆయన సునాయాస స్వర్గయాత్రే

అందరికీ ఆత్మియులై, అభిమానపాత్రులై

మన మనసులనె మందిరాలుగా చేసి నిలిచిన

మా మామయ్య ఎప్పటికీ, మరెన్నటికీ.....

నిత్యసత్యమై వెలుగు చిరంజీవులు

చిరంజీవులు. చిరంజీవులు.. చిరంజీవులు....

కవియిత్రి ; శ్రీమతి . కే .దేవి .

దేవి మా కజిన్ బ్రదర్ భాస్కర్ భార్య . మా మరదలు చాలా భావకురాలు . మా బాబాయి గారికి పెద్ద కోడలు మీద , పెద కోడలు కి మామగారి మీద అభిమానము ఓ పిసరు ఎక్కువే . ఎంతైనా పెద్దకోడలు కదా !
ఈ కవిత , దేవి మా బాబాయి గారు , తన మామగారైన మాధవ రావు గారి గురించి వ్రాసినది .
దేవీ , ఇంకా నీనుండి మంచి కవితలు నా ప్రభాతకమలానికి వస్తాయని ఆశిస్తున్నాను .
థాంక్ యు దేవి .

Friday, May 14, 2010

అమ్మా నాన్నఅమ్మ
విత్తనాలని పంటలుగా మార్చే రైతు అమ్మ
మబ్బులుని వానలుగా మార్చె వాన అమ్మ
మన జీవిత నౌకకి తెరచాప అమ్మ
ఈ బ్రహ్మ సృష్టించిన మరో బ్రహ్మ అమ్మ
నాన్న అన్న పదానికి ముందు లేక పోతే అమ్మ అనె పదం
ఆ పదానికి వుండునా నిజమైన అందం
అమ్మ గూర్చి చదవాలంటే చాలునా ఈ చిన్ని జన్మ
ఎంత చదివినా ఒక వాక్యం మిగిలుండే ఉద్గ్రంధం అమ్మ .

నాన్న
నాన్న అన్న పదము కన్న
కమ్మగ వుండదు ఆ వెన్న
లక్షం వైపు దూసుకెళ్ళే బాణం మనమైనా
నాన్నలాంటి విల్లే లేక పోతే దాని ఫలితం సున్నా
నాన్న పెంపకములో కఠినత్వం వున్న
ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన
రేపటి మనకు నిలువుటద్దం నాన్న
అలాంటి నాన్న దేవుడి కన్న మిన్న .

మాతృదినోత్సవం రోజున అమ్మ మీద , నాన్న పుట్టిన రోజున , నాన్న మీద ఈ కవితలు రాశాడు , మా మేనల్లుడు జశ్వంత్ . అవి చూసి వాడేదో పెద్దవాడు అను కోకండి . అదో అప్పుడే గుర్రు మంటున్నాడు , అత్తా నేమైనా చిన్న వాడినా చితక వాడినా ఇప్పుడేగా టెంత్ క్లాస్ కు వచ్చాను అని . ఓకే వొప్పుకున్నాను , నువ్వు కుంచం బెద్దవాడివని సరేనా .అబ్బో వాళ్ళ అమ్మనాన్నల మొహాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయో !!!
ఇలాగే కవితలు రాసి నాకు ఇస్తూ వుండరా బాలకవి . థాంక్ యు జశ్వంత్ .
Tuesday, January 26, 2010

స్వాతంత్రం
మా చిన్న తమ్ముడి ( మా పిన్ని చిన్న కొడుకు ) కుమారుడు జస్వంత్ . గూడూరు లో 9 వ తరగతి చదువుతున్నాడు . వాడికి మా కుటుంబ వారసత్వం , కవితలు రాయటము వచ్చినట్లున్నది . కవితలు రాయటము చాలా ఇష్టం . అందుకే రాత్రి అందరూ నిదురపోయిన తరువాత రాసుకుంటూ వుంటాడు . బాబ్బాబు నాకు కవితలు రాయటము రాదురా , కాసిని నీ కవితలు నాకివ్వు , నా బ్లాగ్ లో వేసుకుంటాను అంటే దయతలచి ఇచ్చాడు . అందులో ఒకటి స్వాతంత్రము మీద రాసినది , గణతంత్ర దినోత్సవము సంధర్భముగా .

ఆంగ్లేయు లు మనపై చేసిన కుతంత్రం

ఏమీ చేయలేక పోయింది ఏమాత్రం

సత్య అహింస లనే గాంధీజీ సూత్రం

" ఇంక్విలాబ్ జిందాబాద్ " అన్న ఆజాద్ గాత్రం ,

ఎదుటివారు ఎవర్నైనా చిత్తు చేసే ఖడ్గ మంత్రం

ఎందరో వీరుల రక్త స్తోత్రం వలన

దేశానికి దొరికింది స్వతంత్రం .

కాబట్టి మరువకూడదు వీరందరినీ ఏమాత్రం .


బారతీయు లందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి