Sunday, May 8, 2011

జనని


"జనని"
మాత్రుత్వమనే అత్యుత్తమమైన స్థాయికి చేరుకుంటూ
ఓ స్త్రీ మూర్తి మనకిచ్చే అపురూప వరం "జననం"
మనకు జన్మనిచ్చి ఆ స్త్రీ మూర్తి "జనని" అవుతుంది
"జనని" అనే పదవిని పొందటానికి తను
పడిన బాధనంతా మర్చిపోతుంది ఆ
పసికందు నవ్వుల పువ్వుల్లో
అటువంటి జనని రుణం తీర్చుకోవటానికి
మనకు సరిపోదీ చిన్న జీవితం
అందుకే ఆ జననికి నే జన్మించే
ప్రతీ జన్మ అంకితం.... పునరంకితం.......

రచయత ; వంశీకృష్ణ సుజిత్

మాతృదినోత్సవ శుభాకాంక్షలు .

Friday, April 22, 2011

నీ కనులు నా కలలు




నిను చూశా నా కలలో మొదలు
నీకై వెతికా ఇలలో రేపవలు
నీ కనులు, నా కలలు
మరువలేను నా నూరేళ్ళు
నీ నయనాల చురచురలు
నే భరించలేని క్షణాలు
నీ వలపుల తలపులె
నాకు సంకెళ్ళు
ఈ కలవరం, కలకలం
ఇంకా ఎన్నాళ్ళు ?

రచయత ; వంశీ కృష్ణ సుజిత్

Tuesday, April 5, 2011

ఎదురుచూపులు




1 . "శృంగారం"

సుమ కోమల

కోమలి మదిలో గుబులు రేపుతూ

వెన్నెల రేడుకు వేడుకేమిటో

సగం దాగి సంగతేమిటంటున్నాడు.



గుబురు గున్నమామిడి

తోట పక్కన ఏటి ఒడ్డులో

మిసమిసల గుసగుసలేవో

సంగమించాలని వేచిన వేళ

అల్లరి అలలు అల్లన సాగి

అలజడి చేస్తున్నాయెందుకో

అసలె... పొంగే పరువం

ఆపై... రగిలే విరహం

ఏంతకూ... వినరాని

విభుని పాదాల సవ్వడికై

కాచుకున్న తరుణంలో



చిరు చిరు రుసరుసల కసుబుసులతో

నిలువని పసిడి పైటంచు

పైయ్యెదపై జారిపోతుంటె



అందుకు సై అంటూ

మరింత కవ్వించి... సహకరించె

చల చల్లని చిరుగాలి సందడి

మురిపెంగా విసిగిస్తుంటే



కడియాలందెలు, ముత్యాలదండలు

చెలి జూకాల భారాలు

యిక మోయలేనని

తనువు సొదపెడుతుంటె..

యింకెంతసేపో..

ఈ ఎదురుచూపు

నేనోపలేనని.. మది

మర్యాద మరచిపోతుంటె...



అతివా... నీ కలువకళ్ళలొ

రవ్వంత దిగులు తొంగిచూస్తొంది.



అయినా... అలివేణీ

విరహముకుడా మధురమె అన్నారు కదా !



వేచిన మనసుకి

వేయి వసంతాల సందడి తేదా……



హాయిని పంచే ఆతని అనురాగం

నీ సొంతం కాదా



అదిగో... అడుగుల సవ్వడి

అతడేనేమో... యిక

ఈ రేయి తని తీరదేమో.

* * * * * * * * * * * * * *

2. "సాంప్రదాయం "



చీర.. రవికలో

చూడ చక్కని సుందరి

నుదుట కుంకుమ.. చేతి కంకణాలె

భరత జాతి కన్నెకు పసిడి ఆభరణాలు



కవ్వించే జాబిలి

పుష్పించే పూలసందడి

ఆమెను ఆవిష్కరిస్తున్నాయేగాని

అవధులు దాటించలేదు



చిరుగాలి సరాగమాడి

పరువాల పరువును పలుకరించబోయినా



చాలులె... అంటూ

చేతిలో అడ్డుకుందిగానీ

ప్రకృతికి కూడా

తాను పలుచపడలేదు



కలువ కన్నులో కనిపించె ముగ్ధత్వం

మోములో అగుపించె అమాయకత్వం

వరించి వచ్చే విభునికోసం

ఎదురుచూస్తున్న వధువులా లేదూ...


అదీ మన సంస్కారం

అదే మన మాన ప్రాణం

అందుకె అందుతోంది మనకు

దేశ విదేశాల నమస్కారం.

* * * * * * * * * * * * * *

3. "మధ్యమం"



ఓ అందాల అతివా

నీ కన్నుల కలువలలో ఆ గుబులెందుకో

అందుకేనా .... ఆదమరపులో అరజారెను

పరువాల పసిడి పైటంచు



చల్లగ వీచే చిరుగాలి,

అల్లన సాగె అలల అల్లరి,

తొంగి చూచె కొంటె జాబిల్లి

వెన్నెల విరిసే హాయయిన వేళలో

ఎవరికోసమో ఈ ఎదురుచూపు ?



ఓ.. తెలిసిందిలే

ఈ లాహిరి లాలనలో

నిను లాలించే..

విభుని కోసమేకదా ఈ నీ నిరీక్షణ.

నీ చెలుని చేతిలోని

మల్లెల మత్తువాసనలు

ఏ కబురంపినాయో

కురుల కుబుసాల మిసమిసలు

వడివడిగ ముడివీడినాయి



అలివేణీ... యిక నీ ఆశ

నెరవేరే సమయం

నీ చెంతకు చేరనుంది

నీకు మధురమయిన

విందునందిచనుంది

సఖియా శెలవా మరియిక.



రచయిత్రి : దేవి

Wednesday, January 19, 2011

మాతృత్వం




మాతృత్వం

ఆకృతి పొందని ఆకారమేదొ

కడుపులో.....కదలిక మొదలెట్టగానె

నాలో ఎదో తీయని భావన...

నేనెంతో సాధించినట్లు, ఏదో గెలిచినట్లు

ఈ నాలుగు మాసాల కాలనికే

నాకు నేనే అపురూపంగా... మురిపెంగా అనిపిస్తూ..

రోజు రోజుకూ వచ్చే కొత్త మార్పులకు

మనసుల్లసిల్లుతుంటే..... యదపొంగుతుంటె

ఉదరంలో శిశువు మరికొంత పెరిగి

బుల్లిబుల్లి పాదాలతో కదలి.. బుడుంగుమంటూ

బుజ్జిగాడి అల్లరి మొదలయి

ఏడుమాసాల పాపాయిగా ఎదిగినాక

ఎపుడూలేని ఆనందం.... అనుభూతిలో ఉండగానె

తొమ్మిదవ మాసం ప్రవేశించి...యిక
చిన్నారి రాకకోసం ఎదురుచూపు

చిత్రమయిన అనుభూతి

ఆ అనుభవం ఎలా వుంటుందో అని

కొంత అలజడి , అదొరకం ఆందోళన

ఇంతలోనె… అనుకున్న ఆ క్షణం రానేవచ్చింది.

అదోలా నడుములో... అర్ధంకాని నొప్పి

అంగుళం అంగుళం కదులుతూ

పాపాయి పొట్ట చీల్చుకుంటూ వస్తున్న భావన

భరించలేక మెలితిరుగుతూ... అనుకున్నా..

బుద్దుంటె మరింక కనకూడదు.. అని

అలాగె.. ఆ రాత్రంతా నన్నేడిపిస్తూ,

నాకు.. నరకాన్ని చుపిస్తూ..

తెల్లారెసరికి వచింది కేర్ కేర్ మంటూ...

మెత్తని పొత్తిళ్ళలో మరింత మెత్తగా

లేతగులబి మొగ్గలా.. ముద్దుగా.

సొలిపొతున్న కళ్ళను విప్పార్చి చుసుకున్నా

ఎంత ముద్దుగా ఉందో నా బంగారుతల్లి

ఎంత గర్వమో నాలో ఆకాశంలా

మనసంతా ఆనందమె నిండగా

అపురూపంగా గుండెలకదుముకుంటుంటె

అనిపించింది.... యిలాంటి చిన్నారులను

ఎంతమందినయినా కనొచ్చని.

నా మనసు నన్ను చూచి నవ్వింది

మరెంతసేపయిందనీ...బుద్దుంటే

కనకూడదు అనుకుని

యింతలొ అంత బుద్దీ ఏమయినట్లు ..?

అదేకదా విచిత్రం... అమ్మమనసు చిత్రం

యిలాంటి అనుభూతి కోసం,

ఈ ఆనందంకోసం , ఈ ఆత్మవిశ్వాసంకోసం

ఈ తృప్తి కోసం.... ఏ నరకమయినా భరించి

పేగులు తెంచుకుంటూ వచ్చే చిన్నారులను

కనాలనె అనుకుంటుంది... ఆడది

అందుకేనేమొ అది "మాతృత్వం " అయింది

ఎప్పటికీ కొత్తదిలా, ఎప్పుడూ కావాలనిపించేలా

ఏ తల్లీ మరువలేనిది మరపురానిది
ఈ "మాతృత్వం"... అదే "మాతృతత్వం"

రచయిత్రి ; దేవి
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి