Showing posts with label వంశీ కవిత. Show all posts
Showing posts with label వంశీ కవిత. Show all posts

Sunday, May 8, 2011

జనని


"జనని"
మాత్రుత్వమనే అత్యుత్తమమైన స్థాయికి చేరుకుంటూ
ఓ స్త్రీ మూర్తి మనకిచ్చే అపురూప వరం "జననం"
మనకు జన్మనిచ్చి ఆ స్త్రీ మూర్తి "జనని" అవుతుంది
"జనని" అనే పదవిని పొందటానికి తను
పడిన బాధనంతా మర్చిపోతుంది ఆ
పసికందు నవ్వుల పువ్వుల్లో
అటువంటి జనని రుణం తీర్చుకోవటానికి
మనకు సరిపోదీ చిన్న జీవితం
అందుకే ఆ జననికి నే జన్మించే
ప్రతీ జన్మ అంకితం.... పునరంకితం.......

రచయత ; వంశీకృష్ణ సుజిత్

మాతృదినోత్సవ శుభాకాంక్షలు .

Friday, April 22, 2011

నీ కనులు నా కలలు




నిను చూశా నా కలలో మొదలు
నీకై వెతికా ఇలలో రేపవలు
నీ కనులు, నా కలలు
మరువలేను నా నూరేళ్ళు
నీ నయనాల చురచురలు
నే భరించలేని క్షణాలు
నీ వలపుల తలపులె
నాకు సంకెళ్ళు
ఈ కలవరం, కలకలం
ఇంకా ఎన్నాళ్ళు ?

రచయత ; వంశీ కృష్ణ సుజిత్

Friday, November 27, 2009

వంశీనాదం


మా పుట్టింట్లో కవితా ధోరణి ఎక్కువ . అందరూ చిన్నవో పెద్దవో కవితలు రాస్తారు . అదేమిటో నాకా పాండిత్యము అబ్బలేదు . మా మేనళ్ళుళ్ళు రాసిన కవితలు చూడగానే బాబ్బాబు నాకాస్త అప్పియ్యండిరా , ఇంతవరకు నా బ్లాగ్ లో కవితలు రాసుకోలేదు , మీ పేరు చెప్పుకొని రాసుకుంటానురా , అని గడ్డం పట్టుకొని బతిమిలాడుకుంటే , దయతలిచి ఇచ్చారు .

మా పెద్దతమ్ముడు ( మా పిన్ని కొడుకు ) భాస్కర్ కొడుకే ఈ వంశి . మా మరదలు దేవకి కి భావకురాలు అని మారు పేరు . అలా రెండు వైపులనుండి వంశీ కి కవితా గంధం అంటిందన్నమాట. ! మా పిన్ని భాష లో చెప్పాలంటే వాడి బుద్ధి కుదురుగా వున్నప్పుడు కవితలు రాస్తూవుంటాడు . కాని అవన్నీ ఒకచోట రాసుకునే కుదురు ఇంకా రాలేదుట ! మార్చ్ లో కాలేజ్ వదిలి నప్పుడు ఈ కవిత రాసుకున్నాడుట. ప్రస్తుతము , విజయవాడలో యం. కాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు . ఈ కవిత నేను బ్లాగ్ లో వేస్తానన్నప్పుడు , మా అమ్మ అందులోని రెండు చరణాలు తెసేయమని వంశీకి చెప్పింది . కాని వంశీ అంతగా వ్రాసుకున్నవి నాకు తీయాలనిపించక అలానే వుంచాను .

వంశీనాదం :
కాలమెలా గడిచిందో తెలియని మూడు వసంతాలు
తరచి చూసుకుంటే ఆ గడిచిన కాలములో
కొత్త పరిచయాలు , సరికొత్త స్నేహాలు
కవ్వించే పడుచుల మాటలు
వాటికి కొంటె కుర్రాళ్ళ సమాధానాలు
మధురమైన అనుభూతులు
పంచుకున్న తాయిలాలు
మధ్య మధ్య లో చిరు కలహాలు , గిల్లి కజ్జాలు
కొన్ని కలతలు , మరి కొన్ని కలవరింతలు
చేసిన సన్నాహాలు , ఉత్సవాలు , అల్లర్లు
అరికట్టే అధ్యాపకులు
మళ్ళీ బుజ్జగించి , ఊరడించే ఉపాధ్యాయులు
శిలను మలిచి , శిల్పంగా మార్చి
విలువైన మార్గము చూపే మార్గదర్శకులు
వీరందరి ఆశీర్వచనాలతో
జీవిత పయనంలోకి తొలి అడుగు వేస్తూ
నేడు విడిపోతున్నా , వీడి పోని స్నేహానికి
మన కలయిక భాష్యం చెప్పాలి
శాశ్వత రూపంగా నిలచి పోవాలి . . . . . . .

నీ కవిత నా ప్రభాతకమలం లో ప్రచురించేందుకు అనుమతించినందుకు , థాంక్ యు వంశీ . నీనుండి ఇంకా కవితలు రావాలని కోరుకుంటున్నాను .
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి