Showing posts with label కబురులు. Show all posts
Showing posts with label కబురులు. Show all posts

Tuesday, July 21, 2009

నా (మే ) టి మహిళ


శ్రీమతి.కె. వసంత గారు మావారి అక్కయ్య, మా పెద్ద ఆడపడుచు గారు. ఆవిడకి చాలా చిన్నతనము లోనే వివాహము జరిగింది. అయినా చదువును ఆపకుండా పట్టుదలతో యం.ఏ వరకూ చదివి, ఖమ్మం సిద్దారెడ్డి కాలేజీ లో లెక్చరర్ గా పని చేసి, ప్రస్తుతము రిటైర్మెంట్ తరువాత విశ్రాంతి తీసుకుంటున్నారు. బాల్యమునుండే కుటుంబ భాద్యతలు, చదువు, ఆ తరువాత వుద్యోగము నిర్వహించారు.కుటుంబ బాద్యతలు, వుద్యోగములోని పనివత్తిడి వున్నా వారి నలుగురు పిల్లల చదువు ,ఇతర అవసరాలు ఆవిడే చూసుకునే వారు.పిల్లల స్కూల్ లో ఏ కాంపిటీషన్ జరిగినా ,ఫాన్సీ డ్రస్స్ , వ్యాసరచన పోటీ ఇలా ఏదైనా పిల్లలను దానికి సిద్దము చేసి ,వారు పాల్గొనేట్టుగా చూసేవారు. చదువులోనూ సహాయము చేసేవారు.వారి అబ్బాయి రవి యం.యస్ చేసేందుకు మొదటిసారి యు.యస్ వెళ్ళేటప్పుడు ,అక్కడ ఏలా నడుచుకోవాలి మొదలైన విషయాలు కాసెట్ లో రికార్డ్ చేసి ఇచ్చారు. అది రవి నేగాక అతని స్నేహితులు కూడా విని ఆచరించారట. నలుగురు పిల్లలు కూడా పి.జి చేసి ఉన్నత ఉద్యోగములలో స్తిరపడ్డారు. ఇల్లాలుగా ,తల్లిగా ,ఉద్యోగినిగా అనుభవశాలి ఐన నాటి మహిళ మేటి మాట.
ఈ రోజుల్లో మనమంతా తీరిక లేకుండా కాలం గడుపుతున్నాము. విషయాలను ఆలోచించటానికి గాని ,చిన్న పిల్లలని చూసుకోవటానికి గాని ,వారికి మంచి మాటలు ,మంచినడత నేర్పించటానికి కాని సమయము లేదు.మన మనస్సులో వున్నదొకటి, చెప్పేదొకటి , చేసేదొకటిగా వుంటోంది. దీనికి తగ్గట్లే చాలావరకు అధికారము లో వున్న వారు కూడా అధికారం వచ్చేవరకున్నట్లు గా అధికారము లో కి వచ్చినతరువాత వుండటము లేదు. "యధా రాజా తధా ప్రజా". మనలని , మన రాజకీయ వాదులని చూసి పిల్లలు ఏమి నేర్చుకోవాలి ?

అంతా పోటీ ప్రపంచం . ఒక్క మార్క్ తో ముందుకు వెళ్ళాలన్న తపన పిల్లలలో పెంచుతున్నాము. వాడికి మార్కులు రాక సీట్ దొరక్కపోతే వేరే వాళ్ళతో పోల్చి కించ పరుస్తున్నాము.పిల్లలకు ఆటలాడు కోవటానికి , మన నాయకుల గురించి వినటానికి కాని , వారి గురించి చదువుకోవటానికి కాని సమయము లేదు.పెద్దవాళ్ళ మాటలలో వున్న సారాంశాన్ని గ్రహించే శ్రద్ద లేదు. ఎంతసేపూ మార్కులూ , సీట్లు . మార్కులు తక్కువ తెచ్చుకున్న వాళ్ళు , ఎంతో మంది జీవితములో అభివృద్దిని సాదించిన వారున్నారు.కాని , మంచి భావన , మంచి నడత మంచి పలుకు , మంచి పనులు లేకపోతే ఎంత చదివినా , ఎన్ని డిగ్రీలు పొందినా నిరుపయోగమే .మాటలను బట్టి ఒక మనిషి మనసును అంచనా వేయవచ్చు .మనం ఉన్నతం గా వుంటేనే ఉన్నతాశయాల గురించి ఆసక్తి చూపగలం .

నిజముగా పిల్లలకు ఎటువైపు వెళ్ళాలో తెలియని సాంఘిక వాతావరణము ప్రస్తుతము నెలకొల్పబడింది. ఆర్ధికాభివృద్ది ,మనిషికైనా దేశానికైనా అవసరమే .కాని స్వార్దాన్ని పెంచేదిగా వుండకూడదు. స్వార్దానికి బానిసలై అన్ని మరిచి అంధుల మవుతున్నాము.

మన సాంఘిక వ్యవస్థను చూసి విదేశీయులు ఇష్ట పడుతున్నారు. ముఖ్యముగా మన కుటుంబ వ్యవస్థ. ఐతే దీనిలో లోపాలు వుండవచ్చు. కాని ఈనాటి పిల్లలకు ,ఈ కుటుంబ వ్యవస్థ లో వున్నమంచి విషయాలు చెప్పాలి.దీన్ని కాపాడుకోవటానికి ప్రతివారు కృషి చేయాలి.

అర్ధము లేని మాటల తో ఇతరులను నొప్పించి ,ఆనందించటము పట్ల పిల్లలను ప్రోత్సహించ కూడదు. మన మాటల ప్రభావము తో బలహీన మనస్కులైన పిల్లలని ఉత్సాహపరిచి ,ఆత్మ విశ్వాసాన్ని పెంచి ఉన్నత స్తితికి తీసుకురావాలి . మాటల తో పొందు మన్ననలు అని పిల్లలకి మంచి మాటలు మాట్లాడటము చిన్న తనము నుంచే నేర్పాలి .
ఆర్ధిక వత్యాసాల ప్రభావం పిల్లలపై చిన్నతనములో పడితే వాళ్ళు సంఘానికి తెలియకుండా నే వ్యతిరేకులవుతారు.అది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది.ప్రస్తుతమున్న సంఘములో ఈ ఆర్ధిక వత్యాసాలు ఎక్కువగానే వున్నాయి. అవి తొలిగించుకొని పిల్లలందరికీ ఒకే రకమైన విద్యావిధానముండాలి. వాళ్ళ ప్రవర్తనలో కూడా ఈ వ్యత్యాసాలుండరాదు.ఇంట్లో కూడా సాద్యమైనంత వరకు పిల్లలకి సింపుల్ గా వుండటము నేర్పించాలి.

నేటి యువతరం డబ్బు సంపాదించాలనే తాపత్రయం తో గాడి తప్పుతున్నారు.భావితరాలకు మంచిని ,మన సంస్కృతిని అందించటానికి తీరిక లేకుండా సతమత మవుతున్నారు .వాళ్ళ ఆరోగ్యాలు దీనివల్ల దెబ్బ తింటున్నాయి. ఆహారపు అలవాట్లు మారి ఆరోగ్యాలలో మార్పులొస్తున్నాయి.ఇది చేధించగల శక్తి యువతకే వుంది. "డబ్బుకన్నా విలువలు ముఖ్యమైనవి ." అన్న విషయాన్ని వాళ్ళు మర్చి పోకుండా తరువాతి తరానికి కూడా అందించాలి . మనము, మన పిల్లలు , ఈ సంఘము లోని భాగాలమే . వ్యక్తులమే .దానికి భిన్నముగా మన పిల్లలని పెంచలేము.

అలాగే కుటుంబ సభ్యులమద్య ఆత్మీయత వుండాలి.అప్పుడే పిల్లలు వాళ్ళ సమస్యలను తల్లి తండ్రులతో పంచుకో గలుగుతారు. తల్లీ తండ్రి అంటే భయం కంటే , గౌరవం ప్రేమ ఎక్కువగా వుంటే ఆ పిల్లలో భద్రతాభావం పెరుగుతుంది.దాని తో వాళ్ళ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.అట్లాగని పిల్లలకు అతి స్వేచ్చ కూడా ఇవ్వరాదు. ఎందుకంటే బయటి ప్రపంచములో నేర ప్రవృత్తి బాగా వుండటాన ,ఆధునికత పేరున అనేక చిక్కులలో పడతారు.

ఇవన్నీ ఆలోచిస్తుంటే ,ఇదివరలో పది మంది పిల్లలున్నా తల్లితండ్రులు హాయిగా వున్నారు కాని ,ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లల తోనే చాలా జాగ్రత్తగా , సున్నితముగా వుండాల్సి వస్తుంది.ఈ నాటి పిల్లలేకదా రేపటి పౌరులు .కేవలం హక్కుల కోసం పోరాడేవారుగా కాక ,భాద్యతలను స్వీకరించగల సత్తా వారికుండేట్లుగా తీర్చి దిద్దే అవసరం వుంది.
విన్నారుగా నాటి మహిళ మేటి మాట . మరి మీ అభిప్రాయం ఏమిటి ?
థాంక్ యు వదినగారు.
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి