Friday, April 7, 2023
Wednesday, April 5, 2023
Tuesday, April 4, 2023
Wednesday, June 29, 2022
Friday, June 24, 2022
2. గాజర్ హల్వా
2. గాజర్ హల్వా
రచన:మాలాకుమార్
(కమల పరచ)
నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.
కొత్తకాపురం వచ్చీరాని వంట. దానికి తగ్గట్టు ఏమండీగారి ఇన్స్ ట్రక్షన్స్.సెలవులో ఇంటికి వెళుతూ ఏదైనా చేసి తీసుకెళ్ళి అత్తింట మెప్పు పొందాలనే ఆరటం!అన్నీ కలిసి ఇదో, నా ఏమండీ కథలలోని రెండో కథ ఈ గాజర్ హల్వా!
పదండి 1969 ,పూణే కు.
అప్పటికి మా కొత్తకాపురం మొదలై కొన్ని నెలలే అయింది.. నేను మా ఏమండీ గారి ఆధ్వర్యములో వంట నేర్చుకుంటున్నాననే భ్రమలో మా ఏమండీ ఉన్నరోజులవి. మా ఏమండీ మిలిట్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో కోర్స్ చేస్తుంటే నేను వాడియా కాలేజ్ లో బి.యే ఫస్ట్ ఇయర్ లో చేరాను.ఇద్దరమూ ఉదయమే 8 గంటలకల్లా కాలేజీ లకు వెళ్ళిపోయేవాళ్లం. మళ్ళీ ఒంటిగంటకల్లా వచ్చేసేవాళ్ళము. వచ్చాకా వంట చేసుకోవచ్చు, కుక్కర్ లో అన్నం, పప్పు ఎంతలో వుడుకుతాయి, రాగానే వండుకుంటే వేడిగా తినొచ్చు అనే మా ఏమండీ గారి అభిప్రాయంతో ఏకీభవించి కాలేజీ నుంచి వచ్చాక వంట మొదలు పెట్టేదాన్ని. పెళ్లైన కొత్తగదా మొగుడి మాట జవదాటకూడదు అనుకునే అమాయకపు అమ్మాయిని మరి.. మా అత్తగారు ఇంట్లోకి రాకూడని మూడు రోజులు మా ఏమండీనే వండేవారట. ఆ అనుభవం తో నా వెనక చేరి, ఇంకాస్త ఉప్పేయ్, కొంచం నీళ్ళు పోయ్ అంటూ సలహాలిస్తూ, ఆ తరువాత తినలేక ఇంత ఉప్పేసావేమిటి? నేను చెప్పినట్లు చేయలేదు అని గొణుగుతూ వుండేవారు. కాని ఇప్పటికీ వినేవాళ్ళుంటే మా ఆవిడకి నేనే వంట నేర్పాను అంటూ ఎంత సేపైనా చెపుతారులెండి. ఏం నేర్పారండీ అంటే ఆమ్లెట్ నేర్పానా ? టీ పెట్టటము నేర్పానా అంటూ లిస్ట్ మొదలుపెడుతారు.తమ గొప్పలు తాము చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదు. చెప్పొద్దు.. ఆ ఆమ్లెట్ కొసం ఎంత గోలని ? (అసలు అది తినేదెవరు ఆయన తప్ప) అయినా ఈ అబ్బాయిలకి అమ్మ వెనుకెనకే తిరుగుతూ, కొద్దో గొప్పో వంట నేర్చేసుకొవటం ఏమి పాడు అలవాటో? ఆ తరువాత వాళ్ల భార్యల పాట్లు భగవంతుడికే తెలుసు. ప్రతీదాంట్లో వేలెట్టి తప్పులు ఎత్తి చూపిస్తారు . ఏ యింతి కథ చూసినా ఇంతే కదా!
.
ఇంతలో ఇద్దరికీ సెలవలొచ్చాయి. హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఏం తీసుకెళ్ళాలి ?అప్పటికి కొద్ది రోజుల ముందే మా మామగారి ఫ్రెండ్స్ వచ్చి, నేను చేసిన టమాటా పప్పు, టమాటా చారు, టమాటా పచ్చడి ,వాళ్ళ కంట పడకుండా మాఏమండి చేసిన టమాటా ఆమ్లెట్ తిని, హైదరాబాద్ లో మా మామగారి దగ్గర మీ కోడలు వంట బ్రహ్మాండం గా చేసింది అని మెచ్చుకున్నారట ! కాబట్టి ఏదైనా చేసి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఆయననే డిసైడ్ చేయమని అడిగాను కదా .. ఇక నేను వూరుకొవచ్చుగా ! అబ్బే అంత మంచి బుద్ది ఏది ? రెండుమూడు సార్లు అర్ద కిలో గాజర్లు హల్వా చేసిన ధైర్యం, అనుభవంతో “ఏమండీ గాజర్ హల్వా చేయనా?” అని అడిగా, . ఆ హల్వా ఆయనకూ నచ్చటము వలన సరే అనేసారు.
"ఎంత ఒక కిలో చేయనా?"
"కిలో ఏం సరిపోతుంది?"
"పోనీ రెండు కిలోలు?"
"కాదులే మూడు కిలోలు చేయి. మనింట్లో అందరికీ స్వీట్ ఇష్టము కదా ."అన్నారు.
సరే కిర్కీ మార్కెట్ కి గాజర్ తెద్దామని వెళ్ళాము. గాజర్ ఫ్రెష్ గా వుండటముతో తెగ నచ్చేసి నాలుగు కిలోలు తీసుకున్నారు. సాయంకాలం పాలవాడికి ఎనిమిది లీటర్ల పాలు కావాలని చెప్పాను. ఏమండి ఇరుగయ్యనీ, పొరుగయ్యనీ అడిగీ, బ్లాక్ లో కొంత వైట్ లో కొంత కొని ఎనిమిది కిలోలల పంచదార తెచ్చారు. సామాన్లన్నీ వచ్చేసాయి. రాత్రి మూడు గంట వరకు గాజర్ తురిమినా వుత్సాహంగానే వున్నాను. మొదటిసారికదా ఇంత పెద్ద ప్రయోగం చేయడం. ఉండదేంటి మరి.. పొద్దున పాలవాడు వచ్చేలోపల జీడి పప్పు వేయించి వుంచుదామని తీసాను. మళ్లీ దానిదో కథ. పదిరూపాయలకే కిలో అని ఇంటిముందుకు ఓ అమ్మాయి తెస్తే అందరమూ ఎగబడి కొనేసాము .ఆ తరువాత ఎవరికో అనుమానం వచ్చి కిలో జీడిపప్పు తూకం వేయిస్తే పూర్తిగా అర్ధ కిలో కూడా లేదు. ఇంకో కిలో కిస్మిస్స్ లు ఓ రెండు కిలోల నెయ్యిలో వేయించి, ఓ వంద గ్రాములు ఇలాచీలు పొడి చేసేసరికి పాలవాడు రానే వచ్చాడు . పక్క ఫ్లాట్ లోనే ఉన్న,మిసెస్ బల్బీర్ దగ్గరికి వెళ్ళి పెద్ద గిన్నె కావాలని అడిగాను, మరి ఆమె దగ్గరే కదా పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. ఏం చేస్తావంటే గాజర్ హల్వా అన్నాను. ఎన్ని కిలోలు అంటూ చిన్న గిన్నె చూపిస్తే ఇది సరిపోదు నాలుగు కిలోలు అని గొప్పగా చెప్పాను. పెద్ద గిన్నె తీసి ఇస్తూ, “ఇత్నా కర్ సక్తీ క్యా?” అనగానే నాకు ఎంత కోపం వచ్చిందో ! ఇంత చేస్తున్నానని కుళ్ళుకుంటోంది. అందుకే మనం వంట చేసేటప్పుడు ఎవ్వరినీ రానీయద్దు అనేవారు అత్తయ్య గారు అనుకొని జవాబివ్వకుండా గిన్నె తీసుకొని వచ్చేసాను. కిరోసిన్ స్టవ్ వెలిగించా.. మరి అప్పుడు మాకు గాస్ కొరత, పంచాదర కొరత కదా ! అందుకే చాలా పొదుపుగా వాడే వాళ్ళము, గిన్నెలో నాలుగు కిలోల గాజర్ తురుము, నాలుగు కిలోల పంచదార , ఎనిమిది కిలోల పాలు కలిపి పెట్టేసి , బట్టలు సర్దుకోవటము మొదలు పెట్టాను. మరి సాయంకాలము నాలుగింటికే ట్రైన్. అప్పటికి పన్నెండైంది . భోజనాలయ్యాయి, బాగ్ సద్దుళ్ళు కూడా అయ్యాయి. .టైం అయిపోతోంది. కాని హల్వానే కొంచం కూడా చిక్కబడలేదు. అలాగే ఉంది. అలిగిన పెళ్లాంలా ! ఏంచేయాలి ? ఎవరికిద్దామన్నా అందరూ సెలవల్లో వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఆపత్ భాంధవి మిసెస్ .బల్బీర్ వచ్చి అయ్యిందా అని అడిగింది. ఏడుపు మొహం వేసుకొని చూపించాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికి అడగటమెందుకో ? అని గొణుక్కుంటూ ఉండగా,ఇంకో రెండు గిన్నెలు తెచ్చి మొత్తం కలిపి, మూడు గిన్నెలలోకి సర్ది, గాస్ స్టవ్వుల మీదికి కూడా ఎక్కించి నువ్వు ఒకటి కలుపు నేను రెండు కలుపుతాను అని చక చకా కలపటము మొదలు పెట్టింది. హమ్మయ్య ఎలా అయితేనేం సరిగ్గా ట్రైన్ టైమ్ కి పూర్తి చేసి, ఆవిడ దగ్గరే వున్న ఓ పెద్ద కాన్లో సర్ది ఇచ్చింది. ఏమో అనుకున్నాను కానీ, పాపం ఆ గిన్నెలు కూడా ఆవిడే తోమేసుకుంది. అంత వేడి వేడి హల్వా ఎలా తీసుకెళ్ళామని మటుకు అడగొద్దు. కాన్ వేడివేడి గా చురకలేస్తూంటే కూలీ మమ్మలినెంత తిట్టాడో చెప్పలేనుగా ! ఇక రుచి అంటారా నాలుగు కిలోల గాజర్, నాలుగు కిలోల పంచదార, ఎనిమిది లీటర్ల పాలూ, రెండు కిలోల నెయ్యీ, కిలో అనుకున్న అర్ద కిలో జీడిపప్పూ,కిలో కిస్మిస్ ,25 గ్రాములకు తగ్గని ఇలాచీ పొడీ తో ఆరుగంటలు వుడికిన హల్వా బాగుండక ఏమౌతుంది !
( (సాహితి - 17, 2009)
https://www.youtube.com/watch?v=NfPI21RR4oE&t=7s
Monday, June 13, 2022
1.ప్రభాతకమలం ఏమండి కథలు – 1
ఏమండి కథలు – 1
(నాపేరు కమల, మా ఏమండీగారి పేరు ప్రభాత్ కుమార్. ఆర్మీలో మేజర్ గా పనిచేసి, వారి అమ్మగారి ఆరోగ్య రీత్యా దగ్గర ఉండవలసి రావటము తో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొన్నారు. మా ఇద్దరి పేర్లు కలిపి "ప్రభాతకమలం" అనే పేరు తో యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసి నా "ఏమండి కథల “ను పోడ్ కాస్ట్ చేసాను. ఆ కథలు వివిధ ప్రింటెడ్, అంతర్జాలపత్రికలల్లో పబ్లిష్ అయ్యాయి. నా మొదటి కథ. . .)
1968 డిసెంబర్ 31
స్థలం; మద్రాసు మెరీనా బీచ్
ఓ గంటసేపటి నుంచి ఏమండీగారు చాలా ధీర్గాలోచనతో, చేతులు వెనక్కి పెట్టుకొని కాసేపు, పక్కన పెట్టుకొని కాసేపు, గడ్డం రాసుకుంటూ కాసేపు అటూ ఇటూ అచార్లూ పచార్లూ చేస్తున్నారు. నేను ఏమండీగారి వెనక ఆ కవాతు చేయలేక, కొత్త కావటం తో మొహమాటం తో ఏమి చెప్పలేక అలాగే నీరసంగా తిరుగుతున్నాను. అప్పటికి మా పెళ్ళై పది రోజులైంది. తిరుపతి లో స్వామివారికి వైభవంగా కళ్యాణం చేయించి, బెంగుళూర్ వెళుదామనుకున్నాము. కళ్యాణం ఐతే వైభవం గానే జరిపించాము కాని స్వామివారు, ఫాగ్ బాగా పడుతొంది, బెంగుళూర్ కు బస్ లు వెళ్ళటం లేదు, మద్రాస్ వెళ్ళండి అని ఆదేశించటం తో ఇదో ఇలా మద్రాస్ లో నాలుగురోజులుగా తిరుగుతున్నాము. ఇంతకీ ఈ అచార్లూ పచార్లూ ఎందుకయ్యా అంటే, ఏమండీగారు నన్ను ఏమని పిలవాలి అని అన్నమాట. కమలను నానా విధాలుగా తిప్పారు. కొన్ని ఏమండీకి నచ్చలేదు. కొన్ని మొహమాటం గా ఊ అని బుర్రూపినా నాకు నచ్చలేదని ఏమండీకి తెలిసిపోతోంది. సమస్య పది రోజులైనా ఓ కొలిక్కి రాలేదు. కనీసం ఇప్పుడైనా ఏదైనా తొస్తే బాగుండు అని నేను అనుకుంటుండగానే, గబుక్కున వెనక్కి తిరిగి "అవును తెలుగు అక్షరాల నుంచే ఎందుకు? ఇంగ్లిష్ లెటర్స్ లో నుంచి కూడా మార్చవచ్చు కదా?" అన్నారు. గబుక్కున తిరగటం తో కింద పడబోతున్న నేను , నిలదొక్కుకొని "అవును" అన్నట్లు తలాడించేసాను. ఇహ ఖాంఆళా లో నుంచి ఏవి తొలిగించాలి అని వాటిని తిరగేసి మరగేస్తున్నారు. నేనూ ఏమి చెపుతారా అని ఆసక్తిగా చూస్తున్నాను. ఖా తీసేసి, మ కు ధీర్గమిచ్చి, " మాల" అంటే ఎలా ఉంది అన్నారు? ఓ బాగుంది అన్నాను.ఆవిధం గా యాభైఏళ్ళ క్రితం డిసెంబర్ 31 న మాల గా పునర్జన్మ ఎత్తానన్నమాట :)
పునర్జన్మ తో పూనా లో, మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏమండీ గారి కోర్స్ తో, కొత్త కాపురం ఇట్టే తిరిగి కొత్త సంవత్సరం వచ్చేసింది. నా మొదటి న్యూఇయర్ పార్టీ. అబ్బా ఎంత ఎక్సైట్ మెంట్. నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా! కోర్స్ ఆఫీసర్స్ అంతా కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అందులోనూ రాఫ్ట్ ఫ్లోర్ ఆన్ రివర్ ( డాన్స్ ఫ్లోర్ రివర్ మీద చెక్కబల్లల తో). ఫేమస్ బాండ్ అదుర్స్. ఇక చీఫ్ గెస్ట్ ఎవరూ టాప్ హీరోయిన్స్ లల్లో ఒకరైన తనూజ. అన్నీ ఏర్పాట్లూ అదుర్స్. మరి మా ప్రిపరేషన్స్ కూడా అందుకు తగ్గట్టు ఉండాలిగా. అబ్బాయిలంతా పెళ్ళి సూట్ లు డ్రైక్లీంగ్ చేయించి, కొత్త టైలు, స్మార్ట్ హేర్ కట్టింగ్స్ తో తయార్. అమ్మాయిలు పెళ్ళి బెనారసీ చీరలు పక్కన పడేసి కొత్తగా వస్తున్న ప్రింటెడ్ సారీస్, నేల్ పాలిష్ , లిప్ స్టిక్ లతో తయార్. ఇంక హడావిడే హడావిడి. డాన్స్ క్లాస్ లో చేరాము. డాన్స్ మాస్టర్ మీకే ఈ కొత్త స్టెప్స్ నేర్పిస్తున్నాను అని ఏవేవో విన్యాసాలు చేయించేవాడు! ఏమండీ సీరియస్ గా, నేను ఈజీబూజీ గా డాన్స్ నేర్చుకున్నాము. వస్తున్నది టాప్ హీరోయిన్. మరి మన మేకప్ కూడా ఆ హీరోయిన్ కు తగ్గట్టు ఉండాలా వద్దా :) మనకేమీ ఆ భయమేమీ లేదు ఎందుకంటే అప్పటి కల్లా డాన్స్ ఏమో కాని వంట తో పాటు మేకప్ కూడా బాగా నేర్చేసుకున్నాను. ఎదురు చూస్తున్న 31 వచ్చేసింది! హేర్ స్టైల్ కోసం, ఇంత జుట్టు ఎందుకిచ్చావు దేవుడా అని ఏడ్చుకుంటూ బాక్ కోంబింగ్ చేసుకుంటూ ఉంటే, ఏమండీ గారు నా కఫ్ లింగ్స్ పెట్టు, నా షర్ట్ నెక్ బటన్ పెట్టు, నా టై సరి చేయి, కాలర్ సరి చేయి అని ఒకటే పిలవటం. అసలు నాకు తెలీక అడుగుతాను అమ్మాయిలా తయారవ్వాల్సింది అబ్బాయిలా? (ఇదే మా ఫ్రెండ్స్ అందరమూ తరువాత చెప్పుకొని కొంపదీసి వీళ్ళంతా తనూజ కు లైన్ వేయటం లేదు కదా అని అపోహ పడ్డాము.) మొత్తానికి అందరూ బ్రహ్మాండమైన మేకప్ లతో, డాన్స్ తో పార్టీ అదరగొట్టేసారు. కాకపోతే ఈ మధ్య తెలిసిన సంగతేమిటంటే ఆ డాన్స్ మాస్టర్ దగ్గరకు అందరూ వెళ్ళారు. ప్రతివాళ్ళ తో మీకే కొత్త స్టెప్ అంటూ బాగానే ఫీజ్ గుంజి, రాజేష్ ఖన్నా టోపీ పెట్టాడు :) అందుకే అందరికీ విడివిడి క్లాస్ లు, వేరే వేరే టైంలల్లో తీసుకున్నాడు. హోరినీ అని ఇప్పుడు తీరిగ్గా హాశ్చర్య పోతే ఏమొస్తుంది :) ఆ తరువాత సికింద్రాబాద్ లో కోర్స్. సింకింద్రాబాద్ క్లబ్ కు మారింది సీను. అప్పటి నుంచి, ఇప్పటి వరకు చాలా వరకు మా న్యూఇయర్ పార్టీ కి సికింద్రాబాద్ క్లబ్ నే వేదిక.
అలా. . . అలా . . . ఆటపాటలతో వికసించిన మా 'ప్రభాతకమలం' లో ఎన్నో వడిదొడుకులను, సుఖ సంతోషాలను ఒకరికివకరమై పంచుకున్నాము. ఎన్నో మధురానుభూతులను ఆస్వాదించాము. అవే మా ఏమండీ, నేనూ కలిసి రాసుకున్న ఈ "ఏమండీ కథలు." కథ ఏమండీది. కథనం నాది. ముగింపు విధాతది .
(సాహితి- 1-1-2019)
Sunday, May 8, 2011
జనని

Friday, April 22, 2011
నీ కనులు నా కలలు
Tuesday, April 5, 2011
ఎదురుచూపులు

1 . "శృంగారం"
సుమ కోమల
కోమలి మదిలో గుబులు రేపుతూ
వెన్నెల రేడుకు వేడుకేమిటో
సగం దాగి సంగతేమిటంటున్నాడు.
గుబురు గున్నమామిడి
తోట పక్కన ఏటి ఒడ్డులో
మిసమిసల గుసగుసలేవో
సంగమించాలని వేచిన వేళ
అల్లరి అలలు అల్లన సాగి
అలజడి చేస్తున్నాయెందుకో
అసలె... పొంగే పరువం
ఆపై... రగిలే విరహం
ఏంతకూ... వినరాని
విభుని పాదాల సవ్వడికై
కాచుకున్న తరుణంలో
చిరు చిరు రుసరుసల కసుబుసులతో
నిలువని పసిడి పైటంచు
పైయ్యెదపై జారిపోతుంటె
అందుకు సై అంటూ
మరింత కవ్వించి... సహకరించె
చల చల్లని చిరుగాలి సందడి
మురిపెంగా విసిగిస్తుంటే
కడియాలందెలు, ముత్యాలదండలు
చెలి జూకాల భారాలు
యిక మోయలేనని
తనువు సొదపెడుతుంటె..
యింకెంతసేపో..
ఈ ఎదురుచూపు
నేనోపలేనని.. మది
మర్యాద మరచిపోతుంటె...
అతివా... నీ కలువకళ్ళలొ
రవ్వంత దిగులు తొంగిచూస్తొంది.
అయినా... అలివేణీ
విరహముకుడా మధురమె అన్నారు కదా !
వేచిన మనసుకి
వేయి వసంతాల సందడి తేదా……
హాయిని పంచే ఆతని అనురాగం
నీ సొంతం కాదా
అదిగో... అడుగుల సవ్వడి
అతడేనేమో... యిక
ఈ రేయి తని తీరదేమో.
* * * * * * * * * * * * * *
2. "సాంప్రదాయం "
చీర.. రవికలో
చూడ చక్కని సుందరి
నుదుట కుంకుమ.. చేతి కంకణాలె
భరత జాతి కన్నెకు పసిడి ఆభరణాలు
కవ్వించే జాబిలి
పుష్పించే పూలసందడి
ఆమెను ఆవిష్కరిస్తున్నాయేగాని
అవధులు దాటించలేదు
చిరుగాలి సరాగమాడి
పరువాల పరువును పలుకరించబోయినా
చాలులె... అంటూ
చేతిలో అడ్డుకుందిగానీ
ప్రకృతికి కూడా
తాను పలుచపడలేదు
కలువ కన్నులో కనిపించె ముగ్ధత్వం
మోములో అగుపించె అమాయకత్వం
వరించి వచ్చే విభునికోసం
ఎదురుచూస్తున్న వధువులా లేదూ...
అదీ మన సంస్కారం
అదే మన మాన ప్రాణం
అందుకె అందుతోంది మనకు
దేశ విదేశాల నమస్కారం.
* * * * * * * * * * * * * *
3. "మధ్యమం"
ఓ అందాల అతివా
నీ కన్నుల కలువలలో ఆ గుబులెందుకో
అందుకేనా .... ఆదమరపులో అరజారెను
పరువాల పసిడి పైటంచు
చల్లగ వీచే చిరుగాలి,
అల్లన సాగె అలల అల్లరి,
తొంగి చూచె కొంటె జాబిల్లి
వెన్నెల విరిసే హాయయిన వేళలో
ఎవరికోసమో ఈ ఎదురుచూపు ?
ఓ.. తెలిసిందిలే
ఈ లాహిరి లాలనలో
నిను లాలించే..
విభుని కోసమేకదా ఈ నీ నిరీక్షణ.
నీ చెలుని చేతిలోని
మల్లెల మత్తువాసనలు
ఏ కబురంపినాయో
కురుల కుబుసాల మిసమిసలు
వడివడిగ ముడివీడినాయి
అలివేణీ... యిక నీ ఆశ
నెరవేరే సమయం
నీ చెంతకు చేరనుంది
నీకు మధురమయిన
విందునందిచనుంది
సఖియా శెలవా మరియిక.
రచయిత్రి : దేవి
Wednesday, January 19, 2011
మాతృత్వం

మాతృత్వం
ఆకృతి పొందని ఆకారమేదొ
కడుపులో.....కదలిక మొదలెట్టగానె
నాలో ఎదో తీయని భావన...
నేనెంతో సాధించినట్లు, ఏదో గెలిచినట్లు
ఈ నాలుగు మాసాల కాలనికే
నాకు నేనే అపురూపంగా... మురిపెంగా అనిపిస్తూ..
రోజు రోజుకూ వచ్చే కొత్త మార్పులకు
మనసుల్లసిల్లుతుంటే..... యదపొంగుతుంటె
ఉదరంలో శిశువు మరికొంత పెరిగి
బుల్లిబుల్లి పాదాలతో కదలి.. బుడుంగుమంటూ
బుజ్జిగాడి అల్లరి మొదలయి
ఏడుమాసాల పాపాయిగా ఎదిగినాక
ఎపుడూలేని ఆనందం.... అనుభూతిలో ఉండగానె
తొమ్మిదవ మాసం ప్రవేశించి...యిక
చిన్నారి రాకకోసం ఎదురుచూపు
చిత్రమయిన అనుభూతి
ఆ అనుభవం ఎలా వుంటుందో అని
కొంత అలజడి , అదొరకం ఆందోళన
ఇంతలోనె… అనుకున్న ఆ క్షణం రానేవచ్చింది.
అదోలా నడుములో... అర్ధంకాని నొప్పి
అంగుళం అంగుళం కదులుతూ
పాపాయి పొట్ట చీల్చుకుంటూ వస్తున్న భావన
భరించలేక మెలితిరుగుతూ... అనుకున్నా..
బుద్దుంటె మరింక కనకూడదు.. అని
అలాగె.. ఆ రాత్రంతా నన్నేడిపిస్తూ,
నాకు.. నరకాన్ని చుపిస్తూ..
తెల్లారెసరికి వచింది కేర్ కేర్ మంటూ...
మెత్తని పొత్తిళ్ళలో మరింత మెత్తగా
లేతగులబి మొగ్గలా.. ముద్దుగా.
సొలిపొతున్న కళ్ళను విప్పార్చి చుసుకున్నా
ఎంత ముద్దుగా ఉందో నా బంగారుతల్లి
ఎంత గర్వమో నాలో ఆకాశంలా
మనసంతా ఆనందమె నిండగా
అపురూపంగా గుండెలకదుముకుంటుంటె
అనిపించింది.... యిలాంటి చిన్నారులను
ఎంతమందినయినా కనొచ్చని.
నా మనసు నన్ను చూచి నవ్వింది
మరెంతసేపయిందనీ...బుద్దుంటే
కనకూడదు అనుకుని
యింతలొ అంత బుద్దీ ఏమయినట్లు ..?
అదేకదా విచిత్రం... అమ్మమనసు చిత్రం
యిలాంటి అనుభూతి కోసం,
ఈ ఆనందంకోసం , ఈ ఆత్మవిశ్వాసంకోసం
ఈ తృప్తి కోసం.... ఏ నరకమయినా భరించి
పేగులు తెంచుకుంటూ వచ్చే చిన్నారులను
కనాలనె అనుకుంటుంది... ఆడది
అందుకేనేమొ అది "మాతృత్వం " అయింది
ఎప్పటికీ కొత్తదిలా, ఎప్పుడూ కావాలనిపించేలా
ఏ తల్లీ మరువలేనిది మరపురానిది
ఈ "మాతృత్వం"... అదే "మాతృతత్వం"
రచయిత్రి ; దేవి
Wednesday, December 22, 2010
జ్యోతి కి పుట్టిన రోజు జేజేలు

సహజం గా ఎవరికి ఐనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే చాలా సులువుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పేస్తాము. . కాని ఎందరికో ఎప్పట్నుండో తెలిసి, నాకు ఈ మధ్య నే పరిచయం ఐన వ్యక్తి జ్యోతి గారు..
ఈనాడు ఆదివారం మాగజైన్ లో ఒకసారి తెలుగు బ్లాగులు గురించి చదివి చాలా ఆనందించాను..సాహిత్యం అంటే నాకు ఉన్న ఇష్టం అలాంటిది..అప్పట్నుంచి తెలుగు భాష గురించి కంప్యూటర్ లో వెదుకుతూ వుండేదాన్ని.. ఒకరోజు అనుకోకుండా లీలామోహనం అనే బ్లాగు కనబడింది.. ఏమని చెప్పను నా ఆనందం ?
ఆ బ్లాగు ద్వారా మరికొన్ని బ్లాగులు చూడడం జరిగింది......అప్పుడు చూసాను ఒక బ్లాగులో కొన్ని పదాలు......
ఒక రచయిత్రి తన మనోభావాలు వెల్లడించిన పదాలు. . నన్ను ఆకర్షించాయి.. ఆ బ్లాగు ద్వారా మరికొన్నిబ్లాగులు పరిమళం, అమ్మ ఒడి...ఇంకా ఎన్నో .. అంతటితో ఆగని నేను ఒక బ్లాగుకి శ్రీకారం చుట్టాను.
కాని కొన్ని అంతరాయాలు. ఆగిపోయాను.. ఎందుకంటే ఎంతోమంది బ్లాగులు మెయింటైన్ చేస్తున్నారు.. అన్ని అందమైన భావాల మధ్య నేను నా బ్లాగుకి న్యాయం చేకూర్చలేను అనిపించింది.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు జ్యోతిగారితో మాట్లాడడం జరిగింది..సహజంగానే ఎవరైనా ఇంకొకరికి సహాయం చెయ్యాలంటే వెనకాడతారు ఎంత తెలిసినవారైనా..కాని మొదటి పరిచయంలోనే (మెయిల్ ద్వారా) మాట్లాడిన నాకు జ్యోతిగారు నా బ్లాగుని మరల మొదలు పెట్టేలా తనే డిజైన్ చేసి, నేను ఏమాత్రం శ్రమ పడకుండా నా భావాలు పంచుకునే అవకాశం కల్పించారు.. ప్రమదావనం అనే గ్రూప్ కి పరిచయంచేసి, జీవితం అంటే ఒంటరి ఆలోచనల ముళ్ళపొద కాకుండా మరి కొందరి మనోభావాల సందడిలో పాలు పంచుకునేలా చేశారు.. అందరూ అల్లరి చేస్తున్నా తను మాత్రం చుక్కల్లో చంద్రుడిలా అప్పుడప్పుడూ ప్రత్యక్షమౌతూ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ అందరికీ ప్రాముఖ్యత ఇస్తారు..
దట్ ఈజ్ వాట్ ఐ కాల్ " ఏ గుడ్ లీడర్ షిప్".... నవరసాల కధానాయికలలా తన బ్లాగుల్లో రకరకాల
భావాల రుచులు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు.. ఏందీ సెల్లు లొల్లి అన్నా, గుత్తొంకాయ కూరోయ్ అన్నా ఆమెకే చెల్లు.., కాదేదీ జ్యోతికి అసాధ్యం అని నిరూపిస్తూ అప్పుడప్పుడూ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కనిపిస్తూ, తరచుగా ఆమె ఎక్కడ కనిపిస్తారా అని వెదికితే చాలు , ప్రత్యక్షమౌతూ ఉంటారు.... సాక్షి , ఈనాడు శని, ఆదివారాల మాగజైన్ లలో. . ప్రతి మనిషి కుటుంబ బరువు, భాద్యతలతో పాటు తన గురించి తాను ఆలోచించుకుంటూ "నాకై నేను" అనే భావనతో ఆనందంగా జీవితాన్ని " బ్రతకడం కాదు జీవించడం ముఖ్యం" అని నిరూపించుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది.. ఆ జీవితాన్ని జ్యోతి గారు సాధించారు అనిపిస్తుంది.. అదే నిజమైతే నా హార్ధిక అభినందనలు జ్యోతిగారికి...
పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతిగారు..ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ................................................ రుక్మిణీదేవి...
