Friday, June 24, 2022

2. గాజర్ హల్వా

 

2. గాజర్ హల్వా

రచన:మాలాకుమార్

(కమల పరచ)

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.

కొత్తకాపురం వచ్చీరాని వంట. దానికి తగ్గట్టు ఏమండీగారి ఇన్స్ ట్రక్షన్స్.సెలవులో ఇంటికి వెళుతూ ఏదైనా చేసి తీసుకెళ్ళి అత్తింట మెప్పు పొందాలనే ఆరటం!అన్నీ కలిసి ఇదో, నా ఏమండీ కథలలోని రెండో కథ ఈ గాజర్ హల్వా!

 పదండి 1969 ,పూణే  కు.

అప్పటికి మా కొత్తకాపురం మొదలై కొన్ని నెలలే అయింది.. నేను మా ఏమండీ గారి  ఆధ్వర్యములో వంట నేర్చుకుంటున్నాననే భ్రమలో మా ఏమండీ  ఉన్నరోజులవి. మా ఏమండీ మిలిట్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో కోర్స్ చేస్తుంటే నేను వాడియా కాలేజ్ లో బి.యే ఫస్ట్ ఇయర్ లో చేరాను.ఇద్దరమూ ఉదయమే 8 గంటలకల్లా కాలేజీ లకు వెళ్ళిపోయేవాళ్లం. మళ్ళీ ఒంటిగంటకల్లా వచ్చేసేవాళ్ళము. వచ్చాకా వంట చేసుకోవచ్చు, కుక్కర్ లో అన్నం, పప్పు ఎంతలో వుడుకుతాయి, రాగానే వండుకుంటే వేడిగా తినొచ్చు అనే మా ఏమండీ గారి  అభిప్రాయంతో ఏకీభవించి కాలేజీ నుంచి వచ్చాక వంట మొదలు పెట్టేదాన్ని. పెళ్లైన కొత్తగదా మొగుడి మాట జవదాటకూడదు అనుకునే అమాయకపు అమ్మాయిని మరి.. మా అత్తగారు ఇంట్లోకి రాకూడని మూడు రోజులు  మా ఏమండీనే  వండేవారట. ఆ అనుభవం తో నా వెనక చేరి, ఇంకాస్త ఉప్పేయ్, కొంచం నీళ్ళు పోయ్ అంటూ సలహాలిస్తూ, ఆ తరువాత తినలేక ఇంత ఉప్పేసావేమిటి? నేను చెప్పినట్లు చేయలేదు అని గొణుగుతూ వుండేవారు. కాని ఇప్పటికీ వినేవాళ్ళుంటే మా ఆవిడకి నేనే వంట నేర్పాను అంటూ ఎంత సేపైనా చెపుతారులెండి. ఏం నేర్పారండీ అంటే ఆమ్లెట్ నేర్పానా ? టీ పెట్టటము నేర్పానా అంటూ లిస్ట్ మొదలుపెడుతారు.తమ గొప్పలు తాము చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదు. చెప్పొద్దు.. ఆ ఆమ్లెట్ కొసం ఎంత గోలని ? (అసలు అది తినేదెవరు ఆయన తప్ప) అయినా ఈ అబ్బాయిలకి అమ్మ వెనుకెనకే తిరుగుతూ, కొద్దో గొప్పో వంట నేర్చేసుకొవటం ఏమి పాడు అలవాటో?  ఆ తరువాత వాళ్ల భార్యల పాట్లు భగవంతుడికే తెలుసు. ప్రతీదాంట్లో వేలెట్టి తప్పులు ఎత్తి చూపిస్తారు . ఏ యింతి కథ చూసినా ఇంతే కదా!

.

ఇంతలో ఇద్దరికీ సెలవలొచ్చాయి. హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఏం తీసుకెళ్ళాలి ?అప్పటికి కొద్ది రోజుల ముందే మా మామగారి ఫ్రెండ్స్ వచ్చి, నేను చేసిన టమాటా పప్పు, టమాటా చారు, టమాటా పచ్చడి ,వాళ్ళ కంట పడకుండా మాఏమండి  చేసిన టమాటా ఆమ్లెట్ తిని, హైదరాబాద్ లో మా మామగారి దగ్గర మీ కోడలు వంట బ్రహ్మాండం గా చేసింది అని మెచ్చుకున్నారట ! కాబట్టి ఏదైనా చేసి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఆయననే డిసైడ్ చేయమని అడిగాను కదా  .. ఇక నేను వూరుకొవచ్చుగా ! అబ్బే అంత మంచి బుద్ది ఏది ? రెండుమూడు సార్లు అర్ద కిలో గాజర్లు హల్వా చేసిన ధైర్యం, అనుభవంతో ఏమండీ గాజర్ హల్వా చేయనా?” అని అడిగా, . ఆ హల్వా ఆయనకూ నచ్చటము వలన సరే అనేసారు.

"ఎంత ఒక కిలో చేయనా?"

"కిలో ఏం సరిపోతుంది?"

"పోనీ రెండు కిలోలు?"

"కాదులే మూడు కిలోలు చేయి. మనింట్లో అందరికీ స్వీట్ ఇష్టము కదా ."అన్నారు.

సరే కిర్కీ మార్కెట్ కి గాజర్ తెద్దామని వెళ్ళాము. గాజర్ ఫ్రెష్ గా వుండటముతో తెగ నచ్చేసి నాలుగు కిలోలు తీసుకున్నారు. సాయంకాలం పాలవాడికి ఎనిమిది లీటర్ల పాలు కావాలని చెప్పాను. ఏమండి ఇరుగయ్యనీ, పొరుగయ్యనీ అడిగీ, బ్లాక్ లో కొంత వైట్ లో కొంత కొని ఎనిమిది కిలోలల పంచదార తెచ్చారు. సామాన్లన్నీ వచ్చేసాయి. రాత్రి మూడు గంట వరకు గాజర్ తురిమినా వుత్సాహంగానే వున్నాను. మొదటిసారికదా ఇంత పెద్ద ప్రయోగం చేయడం. ఉండదేంటి మరి.. పొద్దున పాలవాడు వచ్చేలోపల జీడి పప్పు వేయించి వుంచుదామని తీసాను. మళ్లీ దానిదో కథ. పదిరూపాయలకే కిలో అని ఇంటిముందుకు ఓ అమ్మాయి తెస్తే అందరమూ ఎగబడి కొనేసాము .ఆ తరువాత ఎవరికో అనుమానం వచ్చి కిలో జీడిపప్పు తూకం వేయిస్తే పూర్తిగా అర్ధ కిలో కూడా లేదు. ఇంకో కిలో కిస్మిస్స్ లు ఓ రెండు కిలోల నెయ్యిలో వేయించి, ఓ వంద గ్రాములు ఇలాచీలు పొడి చేసేసరికి పాలవాడు రానే వచ్చాడు . పక్క ఫ్లాట్ లోనే ఉన్న,మిసెస్ బల్బీర్ దగ్గరికి వెళ్ళి పెద్ద గిన్నె కావాలని అడిగాను, మరి ఆమె దగ్గరే కదా పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. ఏం చేస్తావంటే గాజర్ హల్వా అన్నాను. ఎన్ని కిలోలు అంటూ చిన్న గిన్నె చూపిస్తే ఇది సరిపోదు నాలుగు కిలోలు అని గొప్పగా చెప్పాను. పెద్ద గిన్నె తీసి ఇస్తూ, “ఇత్నా కర్ సక్తీ క్యా?” అనగానే నాకు ఎంత కోపం వచ్చిందో ! ఇంత చేస్తున్నానని కుళ్ళుకుంటోంది. అందుకే మనం వంట చేసేటప్పుడు ఎవ్వరినీ రానీయద్దు అనేవారు అత్తయ్య గారు అనుకొని జవాబివ్వకుండా గిన్నె తీసుకొని వచ్చేసాను. కిరోసిన్ స్టవ్ వెలిగించా.. మరి అప్పుడు మాకు గాస్ కొరత, పంచాదర కొరత కదా ! అందుకే చాలా పొదుపుగా వాడే వాళ్ళము, గిన్నెలో నాలుగు కిలోల గాజర్ తురుము, నాలుగు  కిలోల పంచదార , ఎనిమిది కిలోల పాలు కలిపి పెట్టేసి , బట్టలు సర్దుకోవటము మొదలు పెట్టాను. మరి సాయంకాలము నాలుగింటికే ట్రైన్. అప్పటికి పన్నెండైంది . భోజనాలయ్యాయి, బాగ్ సద్దుళ్ళు కూడా అయ్యాయి. .టైం అయిపోతోంది. కాని హల్వానే కొంచం కూడా చిక్కబడలేదు. అలాగే ఉంది. అలిగిన పెళ్లాంలా ! ఏంచేయాలి ? ఎవరికిద్దామన్నా అందరూ సెలవల్లో వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఆపత్ భాంధవి మిసెస్ .బల్బీర్ వచ్చి అయ్యిందా అని అడిగింది. ఏడుపు మొహం వేసుకొని చూపించాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికి అడగటమెందుకో ? అని గొణుక్కుంటూ ఉండగా,ఇంకో రెండు గిన్నెలు తెచ్చి మొత్తం కలిపి, మూడు గిన్నెలలోకి సర్ది, గాస్ స్టవ్వుల మీదికి కూడా ఎక్కించి నువ్వు ఒకటి కలుపు నేను రెండు కలుపుతాను అని చక చకా కలపటము మొదలు పెట్టింది. హమ్మయ్య ఎలా అయితేనేం సరిగ్గా ట్రైన్ టైమ్ కి పూర్తి చేసి, ఆవిడ దగ్గరే వున్న ఓ పెద్ద కాన్లో సర్ది ఇచ్చింది. ఏమో అనుకున్నాను కానీ, పాపం ఆ గిన్నెలు కూడా ఆవిడే తోమేసుకుంది. అంత వేడి వేడి హల్వా ఎలా తీసుకెళ్ళామని మటుకు అడగొద్దు. కాన్ వేడివేడి గా చురకలేస్తూంటే  కూలీ మమ్మలినెంత తిట్టాడో చెప్పలేనుగా ! ఇక  రుచి అంటారా నాలుగు కిలోల గాజర్, నాలుగు  కిలోల పంచదార, ఎనిమిది లీటర్ల పాలూ, రెండు కిలోల నెయ్యీ, కిలో అనుకున్న అర్ద కిలో జీడిపప్పూ,కిలో కిస్మిస్ ,25 గ్రాములకు తగ్గని ఇలాచీ పొడీ తో ఆరుగంటలు వుడికిన హల్వా బాగుండక ఏమౌతుంది !

( (సాహితి - 17, 2009)

 

 

https://www.youtube.com/watch?v=NfPI21RR4oE&t=7s

 

 

No comments:

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి