Monday, December 28, 2009

అమ్మ ఆశీర్వాదము

ఈ రోజు మా అమ్మ పుట్టిన రోజు . ఉదయమే అమ్మను విష్ చేసి వద్దామని నేను , జయ అమ్మ దగ్గరికి వెళ్ళాము . అమ్మకు నేను , నా కిష్టమైన లిల్లీపూల గుచ్చాన్ని , ఒకచీరను బహుకరించి ,అశీర్వాదము తీసుకున్నాను . జయ , అమ్మ కోరిన , శ్రీమద్బగవద్గీత , గీతాప్రెస్ , గోరఖ్ పూర్ వారిది , వారివే చిన్న చిన్న పాకెట్ శ్రీమద్బగవద్గీత లు ఓ పది , ఒక స్వీట్ పాకెట్ ఇచ్చి ఆశీర్వాదము తీసుకున్నది .

అందరూ వాళ్ళ బ్లాగులలో కవితలు రాస్తారు , నాకేమో రాయటము రాదు , నిన్ను రాసి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వవు అని , నేను మా అమ్మతో పోట్లాడుతే , మాజయ కొడుకు ప్రశాంత్ , మా మనవరాలు మేఘ , పుట్టిన రోజు నాడు రాసిన ఆశీస్సుల కవితలు తీసి ఇచ్చింది . ఇవి ఇప్పటివరకూ మాకెందుకు చూపలేదు అని ,ఇంకోసారి పోట్లాడి తెచ్చుకున్నాను .. ఇదిగో ఆ కవితలు .

1. ప్రశాంత్ పుట్టినరోజు అక్టోబర్ 2 . ఆ రోజున అమ్మమ్మ ఆశీస్సులు :

ఎ౦దరో మహాత్ముల జన్మలాగే

ప్రశా౦తుని జన్మ కూడా మేరు

శిఖర మంత అఖండ ఖ్యాతి పొం

దాలని పెద్దల శుభాశీస్సులు .

2 .మా మనవరాలు మేఘ పుట్టినరోజు మార్చ్ 5 .ఆ రోజున పెద్ద అమ్ముమ్మ ఆశీస్సులు .

ముత్యాలు రాశి పోసి నట్లున్న

మురిపాల నవ్వుల ముఖ్య అతిధి

మేఘాల నుంచి రాలి పడ్డ సుమ

బాలకు జన్మదిన శుభాకాంక్షలు .

Friday, November 27, 2009

వంశీనాదం


మా పుట్టింట్లో కవితా ధోరణి ఎక్కువ . అందరూ చిన్నవో పెద్దవో కవితలు రాస్తారు . అదేమిటో నాకా పాండిత్యము అబ్బలేదు . మా మేనళ్ళుళ్ళు రాసిన కవితలు చూడగానే బాబ్బాబు నాకాస్త అప్పియ్యండిరా , ఇంతవరకు నా బ్లాగ్ లో కవితలు రాసుకోలేదు , మీ పేరు చెప్పుకొని రాసుకుంటానురా , అని గడ్డం పట్టుకొని బతిమిలాడుకుంటే , దయతలిచి ఇచ్చారు .

మా పెద్దతమ్ముడు ( మా పిన్ని కొడుకు ) భాస్కర్ కొడుకే ఈ వంశి . మా మరదలు దేవకి కి భావకురాలు అని మారు పేరు . అలా రెండు వైపులనుండి వంశీ కి కవితా గంధం అంటిందన్నమాట. ! మా పిన్ని భాష లో చెప్పాలంటే వాడి బుద్ధి కుదురుగా వున్నప్పుడు కవితలు రాస్తూవుంటాడు . కాని అవన్నీ ఒకచోట రాసుకునే కుదురు ఇంకా రాలేదుట ! మార్చ్ లో కాలేజ్ వదిలి నప్పుడు ఈ కవిత రాసుకున్నాడుట. ప్రస్తుతము , విజయవాడలో యం. కాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు . ఈ కవిత నేను బ్లాగ్ లో వేస్తానన్నప్పుడు , మా అమ్మ అందులోని రెండు చరణాలు తెసేయమని వంశీకి చెప్పింది . కాని వంశీ అంతగా వ్రాసుకున్నవి నాకు తీయాలనిపించక అలానే వుంచాను .

వంశీనాదం :
కాలమెలా గడిచిందో తెలియని మూడు వసంతాలు
తరచి చూసుకుంటే ఆ గడిచిన కాలములో
కొత్త పరిచయాలు , సరికొత్త స్నేహాలు
కవ్వించే పడుచుల మాటలు
వాటికి కొంటె కుర్రాళ్ళ సమాధానాలు
మధురమైన అనుభూతులు
పంచుకున్న తాయిలాలు
మధ్య మధ్య లో చిరు కలహాలు , గిల్లి కజ్జాలు
కొన్ని కలతలు , మరి కొన్ని కలవరింతలు
చేసిన సన్నాహాలు , ఉత్సవాలు , అల్లర్లు
అరికట్టే అధ్యాపకులు
మళ్ళీ బుజ్జగించి , ఊరడించే ఉపాధ్యాయులు
శిలను మలిచి , శిల్పంగా మార్చి
విలువైన మార్గము చూపే మార్గదర్శకులు
వీరందరి ఆశీర్వచనాలతో
జీవిత పయనంలోకి తొలి అడుగు వేస్తూ
నేడు విడిపోతున్నా , వీడి పోని స్నేహానికి
మన కలయిక భాష్యం చెప్పాలి
శాశ్వత రూపంగా నిలచి పోవాలి . . . . . . .

నీ కవిత నా ప్రభాతకమలం లో ప్రచురించేందుకు అనుమతించినందుకు , థాంక్ యు వంశీ . నీనుండి ఇంకా కవితలు రావాలని కోరుకుంటున్నాను .

Monday, November 16, 2009

ఆవాహన

ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రిక నవలా రచయతలలో సుప్రసిద్ధులు . కొన్ని వందల కథలు , వ్యాసాలు , 30 నవలలు వ్రాసారు . " చారిత్రిక నవలా చక్రవర్తి " , "చారిత్రిక నవలాసామ్రాట్ " , " అభినవ పాల్కూరి " అనే బిరుదులు సంపాదించారు . వీరి నవల "ఆవాహన " కోసం 8 సంవత్సరాలు వెతికి , చివరికి వారిదగ్గరనుంచే తీసుకున్నాను . ప్రస్తుతము , ఈ నవల చలనచిత్రము గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట .

మాధవరావు బాంక్ ఉద్యోగి . వరంగల్ కి బదిలీ అయ్యి భార్య లక్ష్మి , కూతురు ఇందిర లతో వస్తాడు . అతని స్నేహితుడు రామచంద్ర రావు లెక్చరర్ గా వరంగల్ లో పని చేస్తుంటాడు . రామచంద్ర రావు భార్య కాత్యాయిని . ఇరు కుటుంబాల వారు చాలా స్నేహితముగా వుంటారు .

ఓ సాయంకాలము , మాధవరావు వేయిస్తంబాలగుడి కి వెళుతాడు . గుడి లోని శిల్పాలను పరవశం గా చూస్తూ , నంది ఎదురుగా వున్న , అసంపూర్తి మంటపం లోకి వెళుతాడు . అప్పటి కే సూర్యాస్తమయం అయ్యింది . ఆలయమంతా తెల్లని వెలుగులతో నిండి వుంది .టూరిస్ట్ లంతా ఒకరొకరే వెళ్ళి పోతున్నారు .శిధిల మంటపము లో ఎవ్వరూ లేరు , మాధవరావు తప్ప .
అక్కొడక నర్తకి బొమ్మ వుంది .
ఆ బొమ్మను చూస్తూ మాధవరావు అలాగే నిలబడి పోయాడు .
ఎందుకో ఆ బొమ్మను చూడగానే మాధవరావు శరీరం గగుర్పొడిచింది .
కళ్ళవెంట నీళ్ళు కారాయి .
ఏమి శిల్పమది ?
ఎంతటి రమణీయ సజీవ చిత్రణం ?!
మాధవరావు ఆ బొమ్మ ముందు తానూ ఓ బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోయాడు .
అలా ఎంత సేపు నిలబడ్డాడో తెలీదు .
ఇంతలో చంద్రోదయమైంది .
వైశాఖపూర్ణిమ !!
పుచ్చపువ్వులా చంద్రుడు వెలిగి పోతున్నాడు ఆకాశంలో .
ఏమిటి చూస్తున్నావు ? ఎవరో మాధవరావును పలకరించారు .
శిధిల మంటపం లో ఒకామె కూర్చొని వుంది .
. . . . . . . . . . . . . . . . . . . . . . .
ఆమె పైటచెంగు గాలికి రెపరెపలాడుతోంది .
చేతుల గాజులు మెరుస్తున్నాయి .
మెడలో బంగారు నగలు ..
ముఖం కోలగా వుంది .
సున్నితమైన పెదవులు , మృదువైన బుగ్గలు . చిన్ని నోరు , గాలికి రేగే ముంగురులు .
. . . . . . . . . . . . . . . . . . . . . . . . ..
ఆమె ఎందుకో ఒక్కసారి ఆవేశంతో ఏడ్చింది . అలా ఏడుస్తూనే శిల్పాల చాటుకు వెళ్ళిపోయినట్లనిపించింది మాధవరావుకు .
"ఏమండీ - ఏమండీ " మాధవరావు కేకేసాడు .ఎవరూ బదులు పలకలేదు . గబ గబా మంటపమంతా వెతికాడు . ఎవరూ కనిపించలేదు .
ఆమె ఎవరు ? ప్రతి పౌర్ణమి కి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ? అదీ మాధవరావుకు మాత్రమే ! అదీ పదీహేను నిమిషాలు మాత్రమే వుంటుంది . ఎందుకు ? ఈ ప్రశ్నలకి సమాధానం నవలలో మాత్రమే తెలుస్తుంది .

" కళలను , రాజకీయాలతో ముడి పెట్టటము నాకిష్టము లేదు కామసాని " . ఆంటాడు శిల్పచార్యుడు , భళ్ళాల సొమేశ్వరుడు .
" ఇక్ష్వాకులు పోయారు ,విష్ణుకుండినులు పోయారు . . . . . నేడు కాకతీయులు , రేపు మరొకరు .ఇలా ఒక్కో సామ్రాజ్యానికి ఒక్కో రాజు , ఒక్కో రాణి , వారికి ఒక్కో కూతురు , ఆ కూతురు పెళ్ళికి మనం మంటపాలు చెక్కటం . ఆ రాణీ , ఆ పెళ్ళీ ఏమీ మిగలవు - మనము చెక్కిన మంటపాలు మాత్రం మిగులుతాయి చరిత్రలో . " అంటాడు శిల్పి . ఎంత నిజమో కదా !

ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నవలనే రాసేస్తానేమో !

ఈ నవల లో రచయత కాకతీయ సామ్రాజ్యపు , వీరశైవ వైభవం , ఆనాటి సామాజిక స్తితిగతులు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు . రాణిరుద్రమదేవి కాలమునాటి వైభవము చదువుతుంటే , ఆ కాలము లో పుట్టి వుంటే బాగుండేది అనిపిస్తుంది !

చదవటము మొదలు పెట్టాక సమయమే తెలీలేదు . పూర్తి చేసాక కాని తెలీలేదు , నేను కాకతీయ సామ్రాజ్యములో లేను , హైదరాబాద్లో మా ఇంట్లో వున్నాను అని . అంతగా లీనమైపోయాను !

ప్రతులకు రచయితని సంప్రదించండి .ఫోన్ నంబర్ : 27425668


ఇది "పుస్తకం " లో వచ్చిన నా ఆర్టికల్ .
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి