Friday, November 27, 2009

వంశీనాదం


మా పుట్టింట్లో కవితా ధోరణి ఎక్కువ . అందరూ చిన్నవో పెద్దవో కవితలు రాస్తారు . అదేమిటో నాకా పాండిత్యము అబ్బలేదు . మా మేనళ్ళుళ్ళు రాసిన కవితలు చూడగానే బాబ్బాబు నాకాస్త అప్పియ్యండిరా , ఇంతవరకు నా బ్లాగ్ లో కవితలు రాసుకోలేదు , మీ పేరు చెప్పుకొని రాసుకుంటానురా , అని గడ్డం పట్టుకొని బతిమిలాడుకుంటే , దయతలిచి ఇచ్చారు .

మా పెద్దతమ్ముడు ( మా పిన్ని కొడుకు ) భాస్కర్ కొడుకే ఈ వంశి . మా మరదలు దేవకి కి భావకురాలు అని మారు పేరు . అలా రెండు వైపులనుండి వంశీ కి కవితా గంధం అంటిందన్నమాట. ! మా పిన్ని భాష లో చెప్పాలంటే వాడి బుద్ధి కుదురుగా వున్నప్పుడు కవితలు రాస్తూవుంటాడు . కాని అవన్నీ ఒకచోట రాసుకునే కుదురు ఇంకా రాలేదుట ! మార్చ్ లో కాలేజ్ వదిలి నప్పుడు ఈ కవిత రాసుకున్నాడుట. ప్రస్తుతము , విజయవాడలో యం. కాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు . ఈ కవిత నేను బ్లాగ్ లో వేస్తానన్నప్పుడు , మా అమ్మ అందులోని రెండు చరణాలు తెసేయమని వంశీకి చెప్పింది . కాని వంశీ అంతగా వ్రాసుకున్నవి నాకు తీయాలనిపించక అలానే వుంచాను .

వంశీనాదం :
కాలమెలా గడిచిందో తెలియని మూడు వసంతాలు
తరచి చూసుకుంటే ఆ గడిచిన కాలములో
కొత్త పరిచయాలు , సరికొత్త స్నేహాలు
కవ్వించే పడుచుల మాటలు
వాటికి కొంటె కుర్రాళ్ళ సమాధానాలు
మధురమైన అనుభూతులు
పంచుకున్న తాయిలాలు
మధ్య మధ్య లో చిరు కలహాలు , గిల్లి కజ్జాలు
కొన్ని కలతలు , మరి కొన్ని కలవరింతలు
చేసిన సన్నాహాలు , ఉత్సవాలు , అల్లర్లు
అరికట్టే అధ్యాపకులు
మళ్ళీ బుజ్జగించి , ఊరడించే ఉపాధ్యాయులు
శిలను మలిచి , శిల్పంగా మార్చి
విలువైన మార్గము చూపే మార్గదర్శకులు
వీరందరి ఆశీర్వచనాలతో
జీవిత పయనంలోకి తొలి అడుగు వేస్తూ
నేడు విడిపోతున్నా , వీడి పోని స్నేహానికి
మన కలయిక భాష్యం చెప్పాలి
శాశ్వత రూపంగా నిలచి పోవాలి . . . . . . .

నీ కవిత నా ప్రభాతకమలం లో ప్రచురించేందుకు అనుమతించినందుకు , థాంక్ యు వంశీ . నీనుండి ఇంకా కవితలు రావాలని కోరుకుంటున్నాను .

Monday, November 16, 2009

ఆవాహన

ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రిక నవలా రచయతలలో సుప్రసిద్ధులు . కొన్ని వందల కథలు , వ్యాసాలు , 30 నవలలు వ్రాసారు . " చారిత్రిక నవలా చక్రవర్తి " , "చారిత్రిక నవలాసామ్రాట్ " , " అభినవ పాల్కూరి " అనే బిరుదులు సంపాదించారు . వీరి నవల "ఆవాహన " కోసం 8 సంవత్సరాలు వెతికి , చివరికి వారిదగ్గరనుంచే తీసుకున్నాను . ప్రస్తుతము , ఈ నవల చలనచిత్రము గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట .

మాధవరావు బాంక్ ఉద్యోగి . వరంగల్ కి బదిలీ అయ్యి భార్య లక్ష్మి , కూతురు ఇందిర లతో వస్తాడు . అతని స్నేహితుడు రామచంద్ర రావు లెక్చరర్ గా వరంగల్ లో పని చేస్తుంటాడు . రామచంద్ర రావు భార్య కాత్యాయిని . ఇరు కుటుంబాల వారు చాలా స్నేహితముగా వుంటారు .

ఓ సాయంకాలము , మాధవరావు వేయిస్తంబాలగుడి కి వెళుతాడు . గుడి లోని శిల్పాలను పరవశం గా చూస్తూ , నంది ఎదురుగా వున్న , అసంపూర్తి మంటపం లోకి వెళుతాడు . అప్పటి కే సూర్యాస్తమయం అయ్యింది . ఆలయమంతా తెల్లని వెలుగులతో నిండి వుంది .టూరిస్ట్ లంతా ఒకరొకరే వెళ్ళి పోతున్నారు .శిధిల మంటపము లో ఎవ్వరూ లేరు , మాధవరావు తప్ప .
అక్కొడక నర్తకి బొమ్మ వుంది .
ఆ బొమ్మను చూస్తూ మాధవరావు అలాగే నిలబడి పోయాడు .
ఎందుకో ఆ బొమ్మను చూడగానే మాధవరావు శరీరం గగుర్పొడిచింది .
కళ్ళవెంట నీళ్ళు కారాయి .
ఏమి శిల్పమది ?
ఎంతటి రమణీయ సజీవ చిత్రణం ?!
మాధవరావు ఆ బొమ్మ ముందు తానూ ఓ బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోయాడు .
అలా ఎంత సేపు నిలబడ్డాడో తెలీదు .
ఇంతలో చంద్రోదయమైంది .
వైశాఖపూర్ణిమ !!
పుచ్చపువ్వులా చంద్రుడు వెలిగి పోతున్నాడు ఆకాశంలో .
ఏమిటి చూస్తున్నావు ? ఎవరో మాధవరావును పలకరించారు .
శిధిల మంటపం లో ఒకామె కూర్చొని వుంది .
. . . . . . . . . . . . . . . . . . . . . . .
ఆమె పైటచెంగు గాలికి రెపరెపలాడుతోంది .
చేతుల గాజులు మెరుస్తున్నాయి .
మెడలో బంగారు నగలు ..
ముఖం కోలగా వుంది .
సున్నితమైన పెదవులు , మృదువైన బుగ్గలు . చిన్ని నోరు , గాలికి రేగే ముంగురులు .
. . . . . . . . . . . . . . . . . . . . . . . . ..
ఆమె ఎందుకో ఒక్కసారి ఆవేశంతో ఏడ్చింది . అలా ఏడుస్తూనే శిల్పాల చాటుకు వెళ్ళిపోయినట్లనిపించింది మాధవరావుకు .
"ఏమండీ - ఏమండీ " మాధవరావు కేకేసాడు .ఎవరూ బదులు పలకలేదు . గబ గబా మంటపమంతా వెతికాడు . ఎవరూ కనిపించలేదు .
ఆమె ఎవరు ? ప్రతి పౌర్ణమి కి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ? అదీ మాధవరావుకు మాత్రమే ! అదీ పదీహేను నిమిషాలు మాత్రమే వుంటుంది . ఎందుకు ? ఈ ప్రశ్నలకి సమాధానం నవలలో మాత్రమే తెలుస్తుంది .

" కళలను , రాజకీయాలతో ముడి పెట్టటము నాకిష్టము లేదు కామసాని " . ఆంటాడు శిల్పచార్యుడు , భళ్ళాల సొమేశ్వరుడు .
" ఇక్ష్వాకులు పోయారు ,విష్ణుకుండినులు పోయారు . . . . . నేడు కాకతీయులు , రేపు మరొకరు .ఇలా ఒక్కో సామ్రాజ్యానికి ఒక్కో రాజు , ఒక్కో రాణి , వారికి ఒక్కో కూతురు , ఆ కూతురు పెళ్ళికి మనం మంటపాలు చెక్కటం . ఆ రాణీ , ఆ పెళ్ళీ ఏమీ మిగలవు - మనము చెక్కిన మంటపాలు మాత్రం మిగులుతాయి చరిత్రలో . " అంటాడు శిల్పి . ఎంత నిజమో కదా !

ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నవలనే రాసేస్తానేమో !

ఈ నవల లో రచయత కాకతీయ సామ్రాజ్యపు , వీరశైవ వైభవం , ఆనాటి సామాజిక స్తితిగతులు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు . రాణిరుద్రమదేవి కాలమునాటి వైభవము చదువుతుంటే , ఆ కాలము లో పుట్టి వుంటే బాగుండేది అనిపిస్తుంది !

చదవటము మొదలు పెట్టాక సమయమే తెలీలేదు . పూర్తి చేసాక కాని తెలీలేదు , నేను కాకతీయ సామ్రాజ్యములో లేను , హైదరాబాద్లో మా ఇంట్లో వున్నాను అని . అంతగా లీనమైపోయాను !

ప్రతులకు రచయితని సంప్రదించండి .ఫోన్ నంబర్ : 27425668


ఇది "పుస్తకం " లో వచ్చిన నా ఆర్టికల్ .

Friday, November 6, 2009

బామ్మ మాట బంగారు బాట

మా చిన్నాడపడుచు ఉష , అత్తగారు , శ్రీమతి . లలిత వెంకటరత్నం గారు . వారు మాకు ఉష పెళ్ళైనప్పటి నుండి పరిచయము . అంటే దాదాపుగా 30 సంవత్సరాలనుండి తెలుసన్నమాట. ఎప్పుడు వారింటికి వెళ్ళినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు . నా ఒక్కదాని తోనే కాదు అందరితో అలాగే వుంటారు , ఎవరికి వారికే వారొక్కరంటేనే ఆవిడకి ప్రత్యేక అభిమానమనుకుంటారు . అంటే అంతగా అందరినీ అభిమానించటము ఆవిడ ప్రత్యేకత . ఇన్ని సంవత్సరాలలో ఆవిడ మోమున చిరునవ్వేతప్ప , విసుగు , చిరాకు ఎప్పుడూ చూడలేదు . మీరు ఇలా ఎలా వుండగలుగుతున్నారు ? మీ విజయ రహస్యం ఏమిటి ? నాకు కాక పోయినా , నిన్ననే పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళిన మీ మనవరాలు , స్నిగ్ధ కైనా చెప్పండి , నేనూ ఓ చెవ్వేస్తాను అని అడిగాను . దానికి ఆవిడ తన జీవితానుభవాన్ని రంగరించి చెప్పిన మంచి ముత్యాలలాంటి మాటలు అందరితో పంచుకుందామనిపించింది .

ఆవిడ చెప్పే మాట వినేముందు , ఆవిడ గురించి వారి పెద్ద అమ్మాయి శ్రీమతి . సంధ్య గారు చెప్పింది విందాము .

" అమ్మలగన్న మాయమ్మ "

మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన ధీర మా అమ్మ

నిజ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎంతొ సమర్ధ్హ వంతంగా ఎదుర్కొని నిలబడ్డ మహా వృక్షం ధాత్రి

లలితమ్మగుంటూరు లో పుట్టి

నరసాపురంలొ మెట్టి యర్రమిల్లి వెంకటరత్నం గారి భార్యగా ఆరుగురిని కన్నతల్లి లలితమ్మ
కళలకు కాణాచి (సంగీతం రాదండోయ్ )

అధ్యాత్మిక చింతనకు చింతామణి

మీకు తెలుసా సంచీ జడ కజ్జికాయ జడ సన్నజాజులతో నెట్టు జడ మల్లెలతో వంకీ జడ మొగలిపూలతో పెట్టె జడ చిలకల జడ ఇలా అరవై రకాల జడలు వేసేది మరీ మరీ చెప్పల్సిన విషయం మా మనమరాలికి ఎప్పుడు ఫ్రాక్ కొనాలన్న గుర్తుకొచ్హేది మా అమ్మ మాకు కుట్టిన జెమిని వారి బాకాలూదే జంట చెడ్డీ పిల్లలు : లక్శ్ సబ్బు మీద పూల సజ్జ గుర్తుకొస్తాయ్ చెప్పాలంటే చాలవుంది చోటేమో కొంచెం వుంది .

అమ్మల (అమ్మమ్మలం కూడా ) గన్న యమ్మ మా అరుగురికి మూలపుటమ్మ

మరిది , చెల్లెలి పిల్లలకి చాల పెద్దమ్మ

"శివుని " పతిగా పొందిన సతిమా అమ్మ లలితమ్మ
సంధ్య

సంధ్య గారు , స్తలాభావమని అనుకోవద్దు . మీ అమ్మగారి గురించి మీరెంత చెప్పినా పొస్ట్ రాసేందుకు నేను సిద్దం !

లలితమ్మగారు చెప్పిన మాట , బంగారుబాట ;

సృష్టికీ ఆరంభ కాలము నుండి మహిళదే ఉన్నత స్థానము గా మనము భావించవచ్చు . దేశకాల పరిస్తితులను బట్టి ఆవిడ భాద్యతలలో స్వభావము మారుతూ వచ్చాయి .ఏమైనప్పటికీ పిల్లల భాద్యత , ఇంటి నిర్వహణ , అథిధి సత్కారాలు , అత్తమామల సేవ , భర్తకు కావలసినవన్నీ సమకూర్చటము తప్పనిసరి .

రాను రాను మహిళలు విధ్యావంతులు అవటమేకాక ఆర్ధికంగా గృహనిర్వహణలో భాగం పంచుకోవలసి వస్తోంది . అంతేగాక పిల్లల విధ్యలో కూడ చాలా మార్పులు రావటమేకాక పోటీ ఎక్కువగా వుండటము వలన పిల్లలను దగ్గర వుండి చదివించవలసి వస్తోంది .

తను చేసే ఉద్యోగము కూడ భాద్యతగా చేయాలి కాబట్టి , సమయానికి గంట కొట్టినట్టు ఆపేసి లేచి రాలేదు .వచ్చే ప్రమోషన్లను వదులుకోలేక ప్రయాసకు ఓర్చి పని చేయాల్సి వస్తోంది .నిజంగా ఆలోచిస్తే మహిళకు శ్రమ ఎక్కువైందనే చెప్పవచ్చు .

అటు ఇల్లు , ఇటు ఉద్యోగం , రెంటినీ సమతూకం గా చేసుకోవాలి .

పిల్లల పెంపకములో చాలా జాగ్రత్త అవసరము . వారి ఆరోగ్యం , మనోవికాసానికి కావలసిన ఆటలూ , విధ్య , ప్రపంచ జ్ఞానం , ఇంకా వారికి కావలసిన ఎన్నో అవసరాలు అన్నిటికీ తల్లి తోడ్పడవలసివున్నది .

2.ఇంటి పనులు చాకచక్యముగా నౌకర్ల తో చేయించుకోవలసిన అవసరము ఎంతైనా వుంది .

3. ఇంట్లో అత్తమామలు , పెద్దవారి అవసరాలు కనిపెట్టి తీర్చగలగాలి .

4. ఆఫీసు వేళకు అన్ని పనులు చేసుకొని , పిల్లలని పంపి , తను కూడ సమయానికి వెళ్ళాలి .

కనుక ఈనాటి అమ్మాయిలకు ఎంత భారం పడుతోందో మనము తెలుసుకోవాలి . నేర్పు తో ప్రతిపనికీ కొంతకాలం కేటాయించుకొని నిర్వర్తించాలి .

ఎంత చేసినా ఏదో మాట వస్తూనే వుంటుంది . శాంతమూ , ఓర్పు ,నేర్పు ఎంతవున్నా చాలవనిపిస్తుంది . కనుక , వారికి చేదోడు వాదోడుగా భర్త , అత్తమామలు , ఇంటికి వచ్చిన అథిధులూ , పిల్లలూ సహకరించాలని నా వుద్దేశం .

అన్ని సమర్ధించకలదు కనుకనే మహి ( భూదేవి ) ళ అంటున్నాము . కనుక ఈనాటి అమ్మాయికి భూదేవికి వున్నంత ఓర్పు వున్నదని నేను భావిస్తున్నాను.

ఇంతటి అనుభవజ్ఞురాలు చెప్పిన సలహాలకు విశ్లేష్ణ రాయటానికి నా అనుభవము సరిపోదు , కనుక మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను .

పిన్నిగారు ,మీ విలువైన సమయములో ,కొద్దిగా నాకోసం వెచ్చించి , నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదములు .
సంధ్య గారు ,అడగగానే మీ అమ్మగారి గురించి తెలిపినందుకు థాంక్స్ అండి .

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి